‘నేను అలాంటి ముస్లింను కాను’
ముంబై: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదుల దాడిని బాలీవుడ్ రచయిత, హీరో సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ ఖండించారు. ఉగ్రవాదులు అమాయకులను చంపడం అమానుషమని ట్వీట్ చేశారు.
‘ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి దాడులకు పాల్పడుతున్నవారు ముస్లింలని చెబుతున్నారు. ముస్లింగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఖురాన్ను అనుసరించాలి. దాడులకు పాల్పడుతున్నవారు దేన్ని పాటిస్తున్నారో తెలియదు కానీ వాళ్లు ఇస్లాంను అనుసరించడం లేదు. దాడులకు పాల్పడుతున్నవాళ్లు ఏ కారణంగా అయినా ముస్లింలు కావచ్చు. నేను అలాంటి ముస్లింను కాను. అమాయకులను చంపడమంటే మానవత్వాన్ని చంపడమే’ అని సలీం ట్వీట్ చేశారు.
ఉగ్రవాదులు ఢాకాలోని కేఫ్పై దాడిచేసి 20 మందిని అతికిరాతకంగా చంపిన సంగతి తెలిసిందే. భారత్కు చెందిన తరుషి జైన్ అనే అమ్మాయితో పాటు విదేశీయులు ప్రాణాలు కోల్పోయారు.