దినకరన్ దూకుడు, ఈపీఎస్ వర్గంలో కలవరం!
అధికార అన్నాడీఎంకే వర్గంలో విభేదాలు తీవ్రమయ్యాయి.
చెన్నై: అధికార అన్నాడీఎంకే వర్గంలో విభేదాలు తీవ్రమయ్యాయి. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్)- శశికళ అక్క కొడుకు దినకరన్ మధ్య వర్గపోరు ముమ్మరం కావడంతో మళ్లీ తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. ఈపీఎస్ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ దినకరన్‌ను కలువడంతో ఆయన ప్రభుత్వ మనుగడపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి.
ప్రస్తుతం అన్నాడీఎంకే (అమ్మ) పార్టీకి నేతృత్వం వహిస్తున్న ఈపీఎస్‌కు కేవలం 122మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఆయన వర్గం నుంచి జారుకుంటే ప్రభుత్వం పడిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మరోవైపు జైలు నుంచి విడుదలైన దినకరన్ ఈపీఎస్ వర్గాన్ని సవాలు చేస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి తనను, చిన్నమ్మ శశికళను ఎవరూ దూరం చేయలేరని, ఆ అధికారం ఎవరికీ లేదని దినకరన్ అంటున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శశికళను కలిసిన అనంతరం దినకరన్ మీడియాతో మాట్లాడారు. శశికళతో, దినకరన్‌తో అన్నాడీఎంకేకు ఎలాంటి సంబంధం లేదని తమిళనాడు ఆర్థికమంత్రి జయకుమార్ చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అన్నాడీఎంకే నుంచి తమను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని అన్నారు.
తీహార్ జైలు నుంచి దినకరన్ విడుదలైన సందర్భంగా పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఆయనను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మన్నార్‌గుడి మాఫియా మళ్లీ పార్టీ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరంచేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ వర్గాన్ని దూరం పెడుతూనే ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఈపీఎస్ వర్గం ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా తనవర్గం నుంచి ఎమ్మెల్యేలు జారుకోకుండా చర్యలు తీసుకుంటోంది. దినకరన్, శశికళను ఎమ్మెల్యేలు కలువకుండా ఈపీఎస్ వర్గం పావులు కదుపుతున్నట్టు సమాచారం.