
సాక్షి, చెన్నై : అధికార అన్నాడీఎంకే నేతలను ముప్పుతిప్పలు పెడుతున్న బహిష్కృతనేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ రాజకీయంగా మరో మెట్టు ఎక్కారు. మధురై జిల్లా మేలూరులో గురువారం ఉదయం దినకరన్ తన సోంత పార్టీ పేరు, చిహ్నంను ప్రకటించారు. ‘అమ్మ మక్కల్ మున్నెట కళగం’ గా పార్టీ పేరును ప్రకటించి, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. దినకరన్ నలుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉన్న జెండాపై దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఫొటోను ముద్రించారు. ఈ సందర్భంగా దినకరన్ మాట్లాడుతూ.. పన్నీరు పెల్వం, పళని స్వామీలు అన్నాడీఎంకేను మోసం చేశారని ఆరోపించారు. ఇటీవల దినకరన్ ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
తమిళనాట ఉన్నన్ని రాజకీయ పార్టీలు మరే రాష్ట్రంలోనూ ఉండకపోవచ్చు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తమిళనాడుగా విడిపోయిన తొలిదినాల్లో కాంగ్రెస్ పార్టీదే పైచేయి. కాంగ్రెస్ అగ్రనేత కామరాజనాడార్ ముఖ్యమంత్రిగా 1963లో రాష్ట్రంలో జాతీయ పార్టీ శకం ముగిసింది. ద్రవిడ సెంటిమెంట్‌తో పుట్టుకొచ్చిన డీఎంకే ఆ తరువాత అధికారంలోకి రాగా, డీఎంకేతో విభేదించి బైటకు వచ్చిన ఎంజీ రామచంద్రన్ అన్నాడీఎంకేను స్థాపించారు. అప్పటి నుంచీ నేటి వరకు డీఎంకే, అన్నాడీఎంకేలదే ఆధిపత్యం, అధికారంలా రాష్ట్ర రాజకీయాలు సాగాయి. రాజకీయ అవసరాలకు తగ్గట్లుగా కాంగ్రెస్ పార్టీ... అన్నాడీఎంకే, డీఎంకేల పంచన చేరడాన్ని అలవాటు చేసుకుంది. మరో జాతీయ పార్టీ బీజేపీకి రాష్ట్రంలో ఉనికే లేదు. ఈ దశలో డీఎంకే, అన్నాడీఎంకేలను స్ఫూర్తిగా తీసుకుని వైగో, విజయకాంత్, శరత్‌కుమార్, జీకే వాసన్, డాక్టర్ రాందాస్, సీమాన్, తిరుమావళవన్ తదితరులు ప్రాంతీయ పార్టీలు పెట్టారు. అయితే కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత వంటి ప్రజాకర్షణ నేతలు ఆయా పార్టీలకు లేకపోవడంతో డీఎంకే, అన్నాడీఎంకేల ప్రాభవాన్ని కొత్త పార్టీలు దెబ్బతీయలేక పోయాయి.
కొత్త పార్టీల శకం
సుదీర్ఘ విరామం తరువాత మరలా కొత్త పార్టీల శకం ప్రారంభమైంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఏర్పడిన రాజకీయ శూన్యతే ప్రముఖ సినీ నటులు కమల్‌హాసన్, రజనీకాంత్‌లకు పార్టీ ఏర్పాటుకు ప్రేరణనిచ్చింది. కమల్‌హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ అనే పార్టీని స్థాపించారు, నటులు రజనీకాంత్ పార్టీ ఏర్పాటుకు సన్నాహ దశలో ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కమల్, రజనీల ప్రాభవం, ప్రభావం ఏమాత్రం ఉంటుందోనని అందరూ అంచనాలు వేస్తుండగా అన్నాడీఎంకే బహిష్కృత నేత దినకరన్ కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. గడిచిన ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది తన సత్తా ఏమిటో నిరూపించుకున్న దినకరన్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అన్నాడీఎంకే, డీఎంకేలను కంగుతినిపించారు. దశాబ్దాల తరబడి ప్రజల హృదయాల్లో నాటుకుపోయిన రెండాకులు, ఉదయసూర్యుడి గుర్తులను కాదని కుక్కర్ గుర్తుపై పోటీ చేసి విజయబావుటా ఎగురువేశారు.
జయ ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్‌లో గెలుపొందడం ద్వారా శశికళ కుటుంబమే జయకు రాజకీయ వారసులనే నినాదాన్ని లేవనెత్తారు. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం దక్కించుకోవాలని ఈసీ వద్ద పోరాడి విఫలమైన దినకరన్ కొత్త పార్టీ ఏర్పాటే మేలనే నిర్ణయానికి వచ్చారు. అఖిలభారత అమ్మా ద్రావిడ మున్నేట్రకళగం, ఎంజీఆర్ అమ్మ మున్నేట్ర కళగం, అమ్మ ఎంజీఆర్ మున్నేట్ర కళగం ఈ మూడు పేర్లలో ఒకదాన్ని తన పార్టీ పేరుగా ఆమోదించేలా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తనకు కలిసొచ్చి విజయాన్ని కట్టబెట్టిన కుక్కర్ గుర్తును శాశ్వతంగా తమకే కేటాయించేలా ఈసీని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దినకరన్ గతంలో పిటిషన్ వేశారు. దీనిపై ఈనెల 9వ తేదీన సానుకూలంగా తీర్పు వెలువడింది. చట్టపరమైన చిక్కులు తొలగిపోవడంతో పార్టీ ఏర్పాటుకు దినకరన్ సిద్ధమయ్యారు.