తమిళనాడులో ఎడతెగకుండా కొనసాగుతున్న రాజకీయ అస్థిరతకు ఇప్పట్లో తెరపడే అవకాశం లేదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును చూస్తే అర్ధమవుతుంది. టీటీవీ దినకరన్ గూటికెళ్లిన 18మంది అన్నా డీఎంకే శాసనసభ్యులపై స్పీకర్ పి. ధన్‌పాల్ అనర్హత వేటు వేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నమైన తీర్పులు వెలువరించింది. స్పీకర్ చర్య సరైనదేనని జస్టిస్ ఇందిరా బెనర్జీ అభిప్రాయపడగా, మరో న్యాయమూర్తి జస్టిస్ సుందర్ ఆయన తీరును వ్యతిరేకించారు. ఈ రెండు తీర్పులూ మూడో న్యాయమూర్తి సుముఖానికి వెళ్లి అక్కడ వెలువరించే అభిప్రాయాన్నిబట్టి తుది తీర్పు ఏమిటన్నది తెలుస్తుంది. దీనంతకూ రెండు మూడు నెలల సమయం పడుతుంది. ఆ తుది తీర్పు వచ్చాక కూడా తమిళనాడు అస్థిరత తొలగిపోతుందన్న భరోసా లేదు. ఆ తీర్పు వెలువడ్డాక దానిపై వేరే రకమైన చర్చ మొదలవుతుంది. శాసనసభ వ్యవహారాల్లో న్యాయవ్యవస్థ జోక్యమేమిటన్న ప్రశ్నను సహజంగానే పాలకపక్షం లేవనెత్తుతుంది. ఆ తీర్పును గుర్తించబోమని స్పీకర్ చెప్పే అవకాశం ఉంటుంది. ఏతావాతా ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి ఇప్పట్లో వచ్చే ముప్పేమీ లేదు.
తమిళనాడు అసెంబ్లీలో ఈ వివాదం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తోంది. అన్నాడీఎంకే అధినేత జయలలిత మరణానంతరం ఆ రాష్ట్ర రాజకీయాల్లో అస్థిరత నెలకొంది. అన్నాడీఎంకేలో చీలికలు, చీలిన పక్షాలు మళ్లీ కలవడం, ఈలోగా శశికళ మేనల్లుడు దినకరన్ పార్టీలోని 18మంది ఎమ్మెల్యేలను కూడగట్టుకోవడంతోపాటు జయ ప్రాతినిధ్యం వహించిన ఆర్‌కే నగర్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుపొందడం లాంటి పరిణామాలు అక్కడి రాజకీయాలను మరింత అయో మయంలోకి నెట్టాయి. అన్నాడీఎంకే ప్రభుత్వానికి తగిన బలం లేదని, అది కొనసాగడానికి వీల్లేదని దినకరన్ వర్గం వాదిస్తోంది. 2016 సెప్టెంబర్‌లో ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనబోతుండగా స్పీకర్ ధన్‌పాల్ దినకరన్ శిబిరం ఎమ్మెల్యేలు అనర్హులని ప్రకటించారు. వారు అనర్హులైతే తప్ప పళనిస్వామి సర్కారు నిలబడే స్థితి లేదు. ఆ దశలో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడంతో బలపరీక్ష ఆగింది.
న్యాయస్థానం వారి అనర్హత చెల్లుతుందని చెబితే తాత్కాలికంగా ప్రభుత్వానికి గండం గడిచినా ఉప ఎన్నికల్లో అది విషమ పరీక్ష ఎదుర్కొనవవలసి వస్తుంది. ఉప ఎన్నికల్లో దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు విజయం సాధిస్తే జనం ఆయన పక్షానే ఉన్నారని తేలుతుంది. పళనిస్వామి అధికారంలో కొనసాగే నైతిక హక్కు కోల్పోతారు. అనర్హత చెల్లదని చెబితే, ఆ 18మందీ బలపరీక్ష సమయంలో 98మంది సభ్యులున్న డీఎంకేతో చేతులు కలుపుతారు. పర్యవసానంగా ప్రభుత్వం పతనమవుతుంది. ఇలా ‘ముందు చూస్తే నుయ్యి... వెనకచూస్తే గొయ్యి’ అన్నట్టు విపత్కర స్థితిలో పడిన పళనిస్వామి ప్రభుత్వం దినదినగండంగా రోజులీడుస్తోంది. దీని ప్రభావం సహజంగానే పాలనపై కూడా ఉంటోంది. స్టెరిలైట్ కంపెనీ కాలుష్యంపై ఆందోళన, పోలీసు కాల్పుల్లో 12మంది ప్రాణాలు కోల్పోవడం దీని పర్యవసానమే.
శాసనసభల్లో స్పీకర్లు తీసుకునే నిర్ణయం లేదా నిర్ణయరాహిత్యం తరచు ఎన్నో సమస్యలకు దారితీస్తోంది. వారి నిర్ణయం వల్ల లేదా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులెదుర్కుంటున్న పక్షాలు న్యాయం కోసం ఏళ్ల తరబడి నిస్సహాయంగా ఎదురుచూడవలసి వస్తున్నది. చాలా సందర్భాల్లో అది దక్కడం దుర్లభమవుతోంది. స్పీకర్‌గా ఎన్నికయ్యే వ్యక్తి తటస్థంగా ఉంటానని, అన్ని పక్షాలకూ సమానమైన అవకాశాలిస్తానని తొలిరోజు గంభీరంగా ఉపన్యాసమిస్తారు. కానీ ఆచరణ మొత్తం అందుకు భిన్నంగా ఉంటుంది. తాము ఏకగ్రీవంగా ఎన్నికయ్యామన్న స్పృహే వారికుండదు. ‘మా హక్కులు కాపాడండి మహాప్రభో’ అని ప్రతిపక్షాలు వేడుకున్నా దిక్కూ మొక్కూ ఉండదు. పాలకపక్షం నీళ్లు నములుతున్నప్పుడూ, విపక్షం నుంచి విమర్శల తీవ్రత పెరిగినప్పుడూ స్పీకర్లు ఆపద్బాంధవుల అవతారమెత్తుతారు. సభను వాయిదా వేయడమో, విపక్షం మైకు కట్ చేయడమో, సభ్యులను సభ నుంచి గెంటేయడమో చేసి పాలక్షపక్షాన్ని ఆదుకుంటారు. ఇక ఫిరాయింపుల విషయంలో చట్టం స్పష్టంగా ఉన్నా నిర్ణయం తీసుకోవడానికి మన స్పీకర్లకు ఏళ్లూ పూళ్లూ పడుతోంది. అందుకు ఆంధ్రప్రదేశ్ మొదలుకొని లోక్‌సభ వరకూ ఎన్నయినా ఉదాహరణలు చెప్పవచ్చు. ఒకపక్క లోక్‌సభ, శాసనసభల కాలపరిమితి దగ్గరపడుతున్నా ఫిరాయింపుల విషయంలో ఏం చేయాలో వారికి బోధపడటం లేదు!
నిజానికి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ వ్యవస్థ ఎంతో ఉన్నతమైనది. స్పీకర్ స్థానంలో ఉండేవారు తటస్థంగా, సత్యనిష్టతో విధులు నిర్వర్తించాలని, నిర్వర్తిస్తారని మన రాజ్యాంగం ఆశిస్తోంది. కానీ జరిగేదంతా ఇందుకు భిన్నం. రాజ్యాంగ ఉల్లంఘన జరిగినప్పుడు దాన్ని సరిచేయడం, రాజ్యాంగాన్ని పరిరక్షించడం న్యాయస్థానాల కర్తవ్యం. కానీ చట్టసభల పరిధిలో అలా జరిగినప్పుడు ఏం చేయాలి? తాము అన్నిటికీ అతీతమని స్పీకర్లు భావిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జరిగిన ఫిరాయింపులపై స్పీకర్లు నిర్ణయాలు ప్రకటించకపోవడం... తెలంగాణలో కాంగ్రెస్ శాసనసభ్యులిద్దరిపై అనర్హత వేటు వేయడంవంటి విషయాల్లో న్యాయస్థానాల్లో ఏం జరుగుతున్నదో జనం చూస్తూనే ఉన్నారు. చట్టసభలు మందబలంతో నడుస్తున్నాయని, స్పీకర్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, విపక్షాల హక్కుల్ని తొక్కేస్తున్నారని, న్యాయస్థానాలు సైతం నిస్సహాయంగా మిగిలిపోతున్నాయని ప్రజానీకంలో అభిప్రాయం ఏర్పడితే అది మౌలికంగా ప్రజాస్వామ్యంపైనే నమ్మకం సడలింపజేస్తుంది. కనుకనే చట్టసభల హక్కులు, స్పీకర్ల అధికారాల విషయంలో స్పష్టత అవసరం. తమిళనాడు వివాదానికి సాధ్యమైనంత త్వరలో తెరపడటం ముఖ్యం.
Comments
Please login to add a commentAdd a comment