'రాయల తెలంగాణపై తుది నిర్ణయం తీసుకోలేదు'
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన అంశంపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఆయన శనివారం ఉదయం జీవోఎం సభ్యుడు జైరాం రమేష్తో సమావేశం అయ్యారు. భేటీ అనంతరం దామోదర విలేకర్లతో మాట్లాడుతూ రాయల తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని, అయితే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. వెనకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజీ .... పోలవరం, భద్రాచలం అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ బిల్లు ఏవిధంగా వస్తుందనే దానిపై చర్చ జరిపినట్లు దామోదర రాజనర్సింహ వెల్లడించారు. అనంతరం ఆయన ఏకే ఆంటోనీతో సమావేశం అయ్యారు.
నిన్న, మొన్నటి వరకూ పది జిల్లాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా ప్రత్యేక రాష్ట్రానికి మొగ్గు చూపిన దామోదర.. తాజగా తన అభిప్రాయాన్ని మార్చుకున్నట్లు కనిపిస్తోంది. రాయల తెలంగాణ అంశాన్ని కేంద్రం చురుగ్గా పరిశీలిస్తోందని, కేంద్రం ఈ అంశంపై తీవ్రంగా చర్చలు జరుపుతోందన్నారు. కాంగ్రెస్ పెద్దల ఈ అంశాన్ని తెరమీదుకు తెచ్చినా దామోదర ఖండించకపోవడంతో ఆయన కూడా రాయల తెలంగాణకు మగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. రోజుకో లీకు, గంటకో బ్రేకుతో రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురిచేస్తున్న కేంద్రం చివరకు ఏ స్టాండ్ తీసుకుంటుందో అనేది మాత్రం ఆసక్తికరమే.