నా భార్య ఆస్తులేవీ తీసుకోలేదు: శశి థరూర్
తన దివంగత భార్య సునందా పుష్కర్ ఆస్తులు వేటినీ తాను తీసుకోలేదని కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కేరళ హైకోర్టుకు తెలిపారు. దివంగత భార్య వల్ల వచ్చిన ఆస్తులను వెల్లడించనందుకు లోక్సభకు ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్కు సమాధానంగా ఆయనీ వివరాలు చెప్పారు. అసలు తన భార్య కెనడా పౌరురాలని, అందువల్ల హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆమె ఆస్తులను తాను పొందే అవకాశమే లేదని శశి థరూర్ అన్నారు. సురేష్ కుమార్ అనే బీజేపీ కార్యకర్త శశి థరూర్ మీద కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. అసలు ఇంతవరకు సునందా పుష్కర్ స్థిర, చరాస్తులు ఏవేంటన్నవి ఇంతవరకు అంచనా వేయలేదని, అలాగే ఆమె వారసత్వ హక్కులు ఎవరికి వెళ్తాయన్నది కూడా ఇంతవరకు నిర్ధారించలేదని శశి థరూర్ కేరళ హైకోర్టుకు చెప్పారు.
ఆమె జీవించి ఉండకపోవడం వల్ల మాత్రమే ఆమె ఆస్తి వివరాలను ఎక్కడా తాను అఫిడవిట్లో చెప్పలేదు తప్ప.. తనకు ఎలాంటి దురాలోచన లేదని ఆయన అన్నారు. ఆమె భారత పౌరురాలు కాకపోవడం, హిందూ వారసత్వ చట్టం కూడా ఆమెకు వర్తించకపోవడం వంటి విషయాలు గుర్తించాలని థరూర్ అన్నారు. కెనడా పౌరురాలైన ఆమె.. వ్యాపార రీత్యా యూఏఈకి వెళ్లిపోయారని తెలిపారు.