ఆటో పరిశ్రమకు భారీ నష్టాలు
న్యూఢిల్లీ: కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఢిల్లీలో భారీ డీజిల్ వాహనాల నిషేధంపై భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్ఐఏఎమ్) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తప్పుడు సమాచారం ఆధారంగా కోర్టులు ఈ నిషేధాన్ని విధించాయంటోంది. దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంతాల్లో 2000 సీసీ కన్నా ఎక్కువ సామర్థ్య వాహనాల నిషేధంతో ఆటో పరిశ్రమ భారీగా నష్టపోయిందని సియామ్ ఆరోపిస్తోంది. ఈ నిషేధం మూలంగా గత 8 నెలల్లో రూ .4,000 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందని, అశోక్ లేలాండ్ ఎండీ, సియామ్ అధ్యక్షుడు వినోద్ దాసరి చెప్పారు. ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (ఏసీఎంఏ) యొక్క 58 వ వార్షిక సమావేశాలలో మాట్లాడిన దాసరి ఈ విషయాన్ని వెల్లడించారు. వాతారణ కాలుష్యానికి గల అసలు కారణాన్ని గుర్తించకుండా ఆటో పరిశ్రమను నియంత్రించాలని ప్రతివారూ చూస్తున్నారని విమ్శించారు. మీడియా సృష్టించిన హైప్, తప్పుడు సమాచారాన్ని ఆధారంగా కోర్టులు నిషేధం విధించాయన్నారు. ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్న వాహనాలపై నిషేధం విధించడం సరికాదన్నారు.
దేశ మాన్యుఫాక్చరింగ్ జీడీపీలో 50 శాతం తమదేనని, ముప్పయి మిలియన్ల ఉద్యోగాలను ఆటో పరిశ్రమ కల్పిస్తోందని ఇందుకు చాలా గర్వంగాఉందని దాసరి పేర్కొన్నారు.కానీ ఎక్కడ కాలుష్య ఉన్నా.. ఎక్కడ ప్రమాదాలు జరిగినా ఆటో పరిశ్రమనే తప్పుపడుతున్నారని దాసరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిషేధం పొల్యూషన్ నియంత్రించడానికి ఎంతమాత్రం ఉపయోగపడదని దాసరి వ్యాఖ్యానించారు. పర్యావరణ సెస్ 1 శాతం విధింపు మూలంగా 2000 సీసీ పైన డీజిల్ వాహనాలను ప్రజలుకొనడం మానేస్తారా? దాని వలన ఢిల్లీ నగరంలో కాలుష్యం తగ్గిపోతుందనా అని ఆయన ప్రశ్నించారు. ఈ పరిణామాలు ఆటో పరిశ్రమకు సవాల్ లాంటిదని దీనికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు. ఆటో పరిశ్రమ తిరిగి తమ ఇమేజ్ పునర్నిర్మాణానికి కలిసి పని చేయాల్సి అవసరం ఉందని దాసరి పిలుపునిచ్చారు.