టీడీపీకి ‘ద్వంద్వ’ జబ్బు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తమను లక్ష్యంగా చేసుకునే విభజనపై అఖిలపక్షం ఏర్పాటు చేసిందన్న టీడీపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సోమవారం ఘాటుగా స్పందించారు. అలా ఒక పార్టీని లక్ష్యం చేసుకోవడమనేది ప్రజాస్వామ్యంలో లేనే లేదన్నారు. ‘‘విభజన విధి విధానాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందానికి నివేదనలేమీ చేయబోమనడం టీడీపీ ద్వంద్వ నీతికి నిదర్శనం. ఆంటోనీ కమిటీ వేస్తే... అది పార్టీ కమిటీ అని, ఎలాంటి నివేదనలూ చేసేది లేదని, ప్రభుత్వ కమిటీ అయితే ఇస్తామని అంది. ఇప్పుడు జీవోఎం ఏర్పాటు చేశాక మాట మాట తప్పింది. టీడీపీకి ద్వంద్వ నీతి జబ్బున్నట్టుంది’’ అన్నారు.
విభజనకు యూపీఏ అనుసరిస్తున్న విధానం అత్యంత ప్రజాస్వమ్యబద్ధమైనదన్నారు. జీవోఎంకు కాంగ్రెస్ కూడా నివేదిక ఇస్తుందని చెప్పారు. ‘‘రాష్ట్రంలో రెండుమార్లు అధికారం కట్టబెట్టిన ఇరు ప్రాంత ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది. వారి మధ్య నెలకొన్న అగాధాన్ని తగ్గించడంతో పాటు వాటి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అన్నారు. మంగ ళవారం నాటికి అందరూ జీవోఎంకు తమ అభిప్రాయాన్ని చెప్పాలని సూచించారు. వ్యక్తిగతంగా కూడా అభిప్రాయాన్ని జీవోఎంకు చెప్పొచ్చన్నారు. హైదరాబాద్‌ను రెండేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఒప్పుకుంటామని జీవోఎంకు కేసీఆర్ సూచించడాన్ని ప్రస్తావించగా, ‘ఆయన స్పందించడం మంచిదే. ఆయన ఏం చెప్పాలనుకున్నా జీవోఎంకు చెప్పొచ్చు. కానీ తన వ్యాఖ్యలతో రాష్ట్రంలో అనవసరంగా సమస్యలు మాత్రం సృష్టించొద్దు’ అన్నారు.