ఉరే సరి | Dilsukhnagar twin blasts case: 5 accused sentenced to death | Sakshi
Sakshi News home page

ఉరే సరి

Published Tue, Dec 20 2016 1:43 AM | Last Updated on Fri, Sep 28 2018 4:46 PM

ఉరే సరి - Sakshi

ఉరే సరి

దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు ముష్కరులకు ఉరిశిక్ష
- ఖరారు చేసిన ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు
- మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురికి శిక్షలు ఖరారు
- పాక్‌లో తలదాచుకున్న మరో ఉగ్రవాది రియాజ్‌ భత్కల్‌
- కోర్టులో ఏమాత్రం పశ్చాత్తాపం కనబర్చని ఉగ్రవాదులు
- ఏ శిక్షకైనా సిద్ధమంటూ న్యాయమూర్తితో వ్యాఖ్య
- భారత్‌లో ‘ఇండియన్‌ ముజాహిదీన్‌’ ఘాతుకాలకు సంబంధించి శిక్షలుపడ్డ తొలి కేసు ఇదే..

- తీర్పును సవాల్‌ చేస్తామన్న దోషుల తరఫు న్యాయవాది

సాక్షి, హైదరాబాద్‌

దిల్‌సుఖ్‌నగర్‌లో మారణహోమం సృష్టించిన ఐదుగురు ముష్కరులకు కోర్టు ఉరిశిక్షలను ఖరారు చేసింది. ఈ మేరకు చర్లపల్లి కేంద్ర కారాగారంలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. గత మంగళవారమే వీరిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం.. తాజాగా వారందరికీ ఉరిశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుగా ఉండగా.. ప్రధాన సూత్రధారి రియాజ్‌ భత్కల్‌ పరారీలో ఉన్నాడు.

భారత్‌లో ఉగ్రవాద సంస్థ ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి, దోషులకు శిక్షలు పడిన తొలి కేసు ఇదే. పాకిస్తాన్‌లో తలదాచుకున్న రియాజ్‌ భత్కల్‌ ఆదేశాల మేరకు ఉగ్రవాదులు 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లకు పాల్పడ్డారు. ఇందులో భత్కల్‌ సోదరుడు మహ్మద్‌ అహ్మద్‌ సిద్ధిబప్ప అలియాస్‌ యాసీన్‌ భత్కల్‌తోపాటు అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ హడ్డీ, జియా ఉర్‌ రెహ్మాన్‌ అలియాస్‌ వకాస్‌(పాకిస్తాన్‌), మహ్మద్‌ తెహసీన్‌ అక్తర్‌ అలియాస్‌ మోను, ఎజాజ్‌ షేక్‌ పాలుపంచుకున్నట్టు ఎన్‌ఐఏ తన దర్యాప్తులో తేల్చింది. విధ్వంసంలో నేరుగా పాల్గొనని కారణంగా యాసీన్‌ భత్కల్‌ను ఐదో నిందితుడిగా చేర్చింది.

ఆరుగురు ఉగ్రవాదుల్లో ప్రస్తుతం ఐదుగురికి ఉరిశిక్ష పడగా.. పాక్‌లో ఉన్న రియాజ్‌ భత్కల్‌పై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేసింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్‌ వద్ద జరిగిన పేలుళ్లలో గర్భస్థ శిశువు సహా 18 మంది మరణించగా... 131 మంది గాయాలైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని మలక్‌పేట, అప్పటి సైబరాబాద్‌ (ఇప్పటి రాచకొండ) కమిషనరేట్‌లోని సరూర్‌నగర్‌ ఠాణాల్లో నమోదైన ఈ కేసులను ఎన్‌ఐఏకు బదిలీ చేశారు. ఈ రెండు కేసులకు కీలక ప్రాధాన్యం ఇచ్చిన ఎన్‌ఐఏ అధికారులు 157 మంది సాక్షులతో పాటు 502 డాక్యుమెంట్లు, 201 ఆధారాలను కోర్టు ముందు ఉంచారు.

ఏ శిక్షకైనా సిద్ధమన్న ఉగ్రవాదులు
సోమవారం ఉదయం ఐదుగురు ముష్కరులను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ ముష్కరులకు ఊరి శిక్షే సరైందని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఆ సమయంలో కోర్టులోనే ఉన్న ముష్కరులకు వారి వాదన వినిపించుకోవడానికి న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. అయితే ఏమాత్రం పశ్చాత్తాపం కనబర్చని ఆ ముష్కరులు.. తాము ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామంటూ న్యాయమూర్తికి చెప్పారు. దీంతో అభియోగాలతోపాటు సాక్ష్యాధారాలు, వాదోపదవాదాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఐదుగురికీ ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్‌ చేస్తామని, దోషుల బంధువుల నుంచి ఈ మేరకు విజ్ఞప్తి అందిందని డిఫెన్స్‌ లాయర్‌ ప్రకటించారు.

రెండు కోణాల్లో ఇదే తొలి కేసులు..
దేశవ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడేందుకు ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌గా (ఏఆర్‌సీఎఫ్‌) ఏర్పడిన ఉగ్రవాద బృందం.. ఆపై రియాజ్‌ భత్కల్‌ నేతృత్వంలో ‘ఉసాబా’గా పేరు మార్చుకుంది. 2002లో ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మారి దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో పేలుళ్లకు పాల్పడింది. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్‌చాట్‌ల్లోనూ విధ్వంసం సృష్టించింది ఐఎం ఉగ్రవాదులే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన 26 విధ్వంసాలకు సంబంధించి ఐఎంపై కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు. 2007లో హైదరాబాద్‌లో జంట పేలుళ్లతోపాటు అన్ని కేసులూ వివిధ కోర్టుల్లో విచారణ దశల్లోనే ఉన్నాయి.

దేశంలో ఐఎం ఘాతుకాలకు సంబంధించి కేసు విచారణ పూర్తయి, నిందితులను దోషులుగా తేల్చి శిక్షలు వేసిన తొలి కేసు దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లదే కావడం గమనార్హం. నగరంలో 1990ల నుంచీ ఉగ్రవాద ఛాయలు ఉండటంతోపాటు అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఎవరికీ ఉరి శిక్ష పడిన దాఖలాలు లేవు. దీంతోపాటు ఒకే ఉందంతానికి సంబంధించి దోషులందరికీ ఉరి శిక్షలు వేసిన కేసులు కూడా లేవు. ఈ కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడటంతో ఈ కోణంలోనూ ఇదే తొలి కేసుగా రికార్డులకెక్కింది. 2011 ఏప్రిల్‌ 18న ఎన్‌ఐఏ హైదరాబాద్‌ యూనిట్‌కు పోలీసుస్టేషన్‌ హోదా లభించింది. నాటి నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి తదితర ప్రాంతాలకు సంబంధించి ఎన్నో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఎవరి పాత్ర ఏంటి?
రియాజ్‌ భత్కల్‌: కీలక సూత్రధారి
యాసీన్‌ : నేపాల్‌ నుంచి కుట్రను అమలు చేశాడు
వఖాస్‌: బాంబుల తయారీ, 107 బస్టాప్‌ వద్ద బాంబుతో ఉన్న సైకిల్‌ పెట్టాడు
మోను: ఏ–1 మిర్చి సెంటర్‌ వద్ద బాంబుతో ఉన్న సైకిల్‌ పెట్టాడు
హడ్డీ: అబ్దుల్లాపూర్‌ మెట్‌లో షెల్టర్‌ తీసుకొని సైకిళ్లు, ఇతర కొనుగోళ్లకు సహకరించాడు
ఎజాజ్‌: ముష్కరులకు అవసరమైన పేలుడు పదార్థాలు, నగదు సమకూర్చాడు

ఎక్కడి వారు?
రియాజ్‌ భత్కల్‌: కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న తెంగినగుడి
అసదుల్లా అక్తర్‌: ఉత్తరప్రదేశ్‌లోని అజామ్‌గఢ్‌లోని గులమ్కాపూర్‌
జకీ ఉర్‌ రెహ్మాన్‌: పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం గోజారా
తెహసీన్‌ అక్తర్‌: బీహార్‌లోని సమిస్తిపూర్‌ జిల్లా ముట్కాపూర్‌
యాసీన్‌ భత్కల్‌: కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న ముగ్దుం కాలనీ
ఎజాజ్‌ షేక్‌: మహారాష్ట్రలో ఉన్న పుణే ఘోర్‌పేట్‌

ఎప్పుడు, ఎక్కడ చిక్కారంటే?

  • ఎజాజ్‌ షేక్‌ను 2013 సెప్టెంబర్‌ 6న ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతమైన సహరంగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు.
  • యాసీన్, హడ్డీలను 2013 ఆగస్టు 29న బిహార్‌లోని రక్సౌల్‌ ప్రాంతంలో బంధించారు.
  • జియా ఉర్‌ రెహ్మాన్‌ను 2014 మార్చి 22న రాజస్తాన్‌లోని అజ్మీర్‌ రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు.
  • తెహసీన్‌ అక్తర్‌ను పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో 2014 మార్చి 25న పట్టుకున్నట్లు ఎన్‌ఐఏ తన రికార్డుల్లో పేర్కొంది.
  • యాసీన్‌ అరెస్టు తర్వాతే ఎజాజ్‌ షేక్‌కు దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లలో పాత్ర ఉన్నట్లు తేలింది. దీనికి ముందు అతడిని ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ మరో కేసులో అరెస్టు చేసింది. ఆపై వీరందరినీ వేర్వేరు సమయాల్లో ఎన్‌ఐఏ హైదరాబాద్‌కు తీసుకువచ్చి దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసుల్లో అరెస్టు చేసింది.


అభియోగాలు ఎప్పుడంటే:
దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లకు సంబంధించి యాసీన్, హడ్డీలపై 2013 మార్చి 14న, రియాజ్, వఖాస్‌ తెహసీన్‌లపై 2014 సెప్టెంబర్‌ 16, ఎజాజ్‌ షేక్‌పై 2015 జూన్‌ 6న ఎన్‌ఐఏ అభియోగపత్రాలు దాఖలు చేసింది.

విచారణ.. శిక్ష:
2016 నవంబర్‌ 21న విచారణ పూర్తి కాగా.. డిసెంబర్‌ 13న ఐదుగురిని దోషులుగా తేల్చింది. 19న (సోమవారం) శిక్షలు ఖరారు చేసింది.

ఏఏ చట్టాలు, సెక్షన్ల కింద అభియోగాలు:
ఐపీసీ 302, 307, 324, 326, 316, 436, 474, 466, 121, 121 ఎ, 122, 201, 120బి సెక్షన్లు
పేలుడు పదార్థాల చట్టంలోని 3, 5 సెక్షన్లు
చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని 10, 16, 17,18, 20, 38 (2), 39 (2) సెక్షన్లు
ప్రభుత్వ ఆస్తులకు నష్టం చట్టంలోని సెక్షన్‌ 4

మృతుల కుటుంబీకుల స్పందన ఇదీ..

దేవుడు సరైన శిక్ష విధించాడు
దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లలో నా కొడుకును కోల్పోయా. వారికి దేవుడు సరైన శిక్షే విధించాడు. పరారీలో ఉన్న ఉగ్రవాదులకూ ఉరిశిక్ష వేయాలి.
– ఆనంద్‌కుమార్‌ తల్లి రాణెమ్మ, ఉరవకొండ, అనంతపురం జిల్లా

ఉరి సంతోషకరం
మా బిడ్డను ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. కాస్త ఆలస్యమైనా నిందితులకు ఉరిశిక్ష పడటం సంతోషకరం.
– భారతమ్మ, పోరెడ్డి స్వప్నారెడ్డి తల్లి, రక్షాపురం కాలనీ, హైదరాబాద్‌

వెంటనే ఉరి తీయాలి..
మాలాంటి వాళ్లకు పుత్రశోకం మిగిల్చిన రాక్షసులకు మరో అవకాశం లేకుండా వెంటనే ఉరి తీయాలి. ఇలాంటి నరహంతకులను క్షమించొద్దు. ఎన్నో కుటుంబాలకు తీరని బాధను మిగిల్చిన హంతకులకు సరైన శిక్షపడింది. ఇలాంటి ద్రోహులు పై కోర్టులకు వెళ్లకుండా వెంటనే శిక్ష వేయాలి. కొడుకు దూరమైన బాధను ఇంకా దిగమింగుకోలేకపోతున్నం.
– ఒడ్డె వినయ్‌కుమార్‌ తల్లిదండ్రులు దేవేంద్ర–లచ్చమ్మ

గాయపడ్డ వారిని మరచిపోయారు
బాంబు పేలుళ్ల బాధితులకు తగిన న్యాయం చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. గోకుల్‌ చాట్‌ బాంబు పేలుళ్లలో గాయపడ్డ బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదు.
– జయప్రకాశ్, బాంబు పేలుళ్ల బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు

అన్యాయంగా పొట్టన పెట్టుకున్నరు
నా బిడ్డను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నరు. నాలాంటి తల్లులకు కడుపుకోతలు పెట్టిన ఆ ఉగ్రవాదులను పట్టుకున్న నాడే సంపనుండే.
– గుంట తిరుపతి తల్లి రాజమ్మ, గోదావరిఖని పరశురాం నగర్, పెద్దపల్లి జిల్లా

నా కొడుకు కళ్లముందే కనిపిస్తున్నడు
నా కొడుకు హైదరాబాద్‌లో ట్రైనింగ్‌ కోసం వెళ్లిండు. కానీ నరరూప రాక్షసులు బాంబులు పేల్చి పొట్టన పెట్టుకున్నరు. వారికి ఉరిశిక్ష వేయడం మంచిదే.
– అమృత రవి తల్లి లక్ష్మి, బేగంపేట్, పెద్దపల్లి జిల్లా

పోయిన నా బిడ్డ తిరిగి రాడు కదయ్యా..
ఒక్కగానొక్క కొడుకు బాంబు పేలుళ్లలో చనిపోయాడు. వాళ్లకు ఉరేస్తే అందని లోకాలకు పోయిన నా కొడుకు మళ్లీ రాడు కదయ్యా.
– శ్రీనివాసరెడ్డి తల్లి పుల్లమ్మ, పాలువాయి (రెంటచింతల)

ఆలస్యమైనా న్యాయం జరిగింది
కూలీ చేసుకుంటూ కొడుకును చదివించినం. హైదరాబాద్‌ వెళ్లి పుస్తకాలు కొనుక్కొస్త అని హైదరాబాద్‌ పోయిన కొడుకు లేడని తెలిసి ఏడ్వడం తప్ప ఏమీ చేయలేకపోయినం. మా కొడుకును పొట్టన పెట్టుకున్న ఆ రాక్షసులకు ఆలస్యమైనా ఉరి శిక్ష వేసి న్యాయం చేసిండ్రు.     –  పద్మ, పోచయ్య

చర్లపల్లి వద్ద కట్టుదిట్టమైన భద్రత  
హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు తీర్పు నేపథ్యంలో చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలతోపాటు ఆక్టోపస్‌ దళాలను మోహరించారు.

భత్కల్‌ టు పుణే  
- అక్కడే ఉగ్రపాఠాలు నేర్చిన యాసీన్‌ ∙ పాక్‌లో దాక్కున్న అతడి సోదరుడు రియాజ్‌
సాక్షి, బెంగళూరు: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో ఐదో నిందితుడిగా ఉన్న మహ్మద్‌ అహ్మద్‌ సిద్ధి బప్ప అలియాస్‌ యాసీన్‌ భత్కల్‌ (33) కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్‌ పట్టణానికి చెందిన వాడు. ఇతని తల్లిదండ్రులు బట్టల వ్యాపారులు. స్థానికంగా ప్రాథమిక విద్య పూర్తి చేసిన భత్కల్‌.. తర్వాత çపుణేæ వెళ్లి వారి కుటుంబంతో గతంలో పరిచయమున్న ఇక్బాల్‌ బండారి పంచన చేరారు. అక్కడే ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడయ్యాడు. బాంబుల తయారీ, అమర్చడం, వాటిని పేల్చడంలో శిక్షణ పొందాడు.

ఆ తర్వాత ఇతడి సోదరుడు రియాజ్‌ భత్కల్‌ (ఏ1) (ప్రస్తుతం పాక్‌లో తలదాచుకుంటున్నాడు) సూచనల మేరకు భారత్‌లో ఇండియన్‌ ముజాహిదీన్‌ సంస్థ కార్యకలాపాలు చూశాడు. ఈ క్రమంలో 2010 ఏప్రిల్‌ 17న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద బాంబులు పేల్చగా, ఐదుగురు భద్రతా సిబ్బందితోపాటు 15 మంది గాయపడ్డారు. ఢిల్లీ, పుణేలోని జర్మన్‌ బేకరీలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ ఇతడి హస్తం ఉన్నట్లు సమాచారం.

నా కొడుకు తప్పు చేయలేదు: భత్కల్‌ తల్లి
తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, తాజా తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని యాసీన్‌ భత్కల్‌ తల్లి బీబీ రహానే పేర్కొన్నారు. హైకోర్టులో న్యాయం దొరక్కపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని భత్కల్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు.


ఈ తీర్పు ఒక గుణపాఠం: దత్తాత్రేయ  
సాక్షి, హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు ఉగ్రవాదులకు ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతించారు. తీవ్రవాదులు, విచ్ఛిన్నకర శక్తుల కార్యకలాపాలకు తోడ్పడే వారికి, సహకారం అందిస్తున్న వారికి ఈ తీర్పు ఓ గుణపాఠమని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు పారిపోయిన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ను పట్టుకుని, కఠినశిక్ష విధించేలా ఎన్‌ఐఏ కృషి చేయాలన్నారు.  ఈ తీర్పు హైదరాబాద్‌ ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన అయిదుగురికి  ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించడాన్ని బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌ స్వాగతించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement