డీజీపీకి కరుణానిధి సంఘీబావం
తమ రాష్ట్ర డీజీపీ కె రామానుజానికి జరిగిన అవమానంపై తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి స్పందించారు. డీజీపీకి సంఘీభావం ప్రకటించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన సందర్భంగా డీజీపీ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఎస్‌పీజీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
'ప్రధానమంత్రి భద్రత ముఖ్యమే. అయితే డీజీపీని అవమానించడం మంచి పద్దతి కాదు' అని డీఎంకే పత్రిక 'మురసోలి'లో కరుణానిధి పేర్కొన్నారు. ఇది తమ రాష్ట్రానికి, పోలీసు విభాగానికి జరిగిన అవమానమని అభిప్రాయపడ్డారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.
పుదుకోట్టై జిల్లా తిరుమయంలో భెల్ అనుబంధ పైపుల తయారీ పరిశ్రమ ప్రారంభోత్సవ నిమిత్తం తమిళనాడుకు వచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిసేందుకు వెళ్లిన రామానుజాన్ని ఎస్‌పీజీ సిబ్బంది అడ్డుకున్నారు. పాస్ లేదనే కారణంతో ఆయనను అడ్డగించారు. దీంతో ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనకు ఆయన దూరంగా ఉండిపోయారు.
డీజీపీకి అవమానం ఎదురు కావడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి జయలలిత ఇప్పటికే ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్లో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని ప్రధాని రాసిన లేఖలో జయలలిత కోరారు. ఈ ఘటనపై విచారణకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది.