భారతీయ జాలర్ల పట్ల శ్రీలంకది అమానుష చర్య
భారతీయ జాలర్ల పట్ల శ్రీలంక నావికా దళం అమానుషంగా వ్యవహారిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితా ఆరోపించారు. ఆ దేశ నావిక దళ చర్యలను కట్టడి చేసేందుకు శ్రీలంకపై దౌత్యపరమైన ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ జయలలిత మంగళవారం భారత ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. చాలా కాలంగా సముద్ర జలాల్లోకి చేపల వేటకు వెళ్లే భారతీయ జాలర్లపై శ్రీలంక నావికదళం దాడులకు పాల్పడటంతోపాటు వారిని అపహరిస్తు శత్రుదేశం మాదిరిగా వ్యవహారిస్తుందని ఆమె రాసిన ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలని ఆ దేశ ఉన్నతాధికారులను ఆదేశించాలని జయలలిత కోరారు. ఇప్పటికైన ప్రభుత్వం అలాంటి చర్యలు చేపట్టకుంటే ఆ దేశ నావిక దళం హద్దు మీరే అవకాశాలు ఉన్నాయని జయలలిత అభిప్రాయపడ్డారు. ఓ వేళ ఇలాంటి చర్యలు మరో సారి జరిగితే ఉపేక్షించేది లేదని శ్రీలంకకు గట్టిగా చెప్పాలని ఆమె సూచించారు.
తమిళనాడుకు చెందిన ఎంతో మంది జాలర్లు తరుచుగా ఆ దేశ నావికాదళ సిబ్బంది చేతుల్లో పలు ఇక్కట్లకు గురవుతున్న సంఘటనలపై తరుచుగా లేఖల ద్వారా మీ దృష్టికి తెస్తున్న సంగతిని ప్రధానికి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆగస్టు 3న తమిళనాడుకు చెందిన 20 భారతీయ జాలర్లను లంక నావికాదళం అరెస్ట్ చేసిన సంఘటనను జయలలిత ఆ లేఖలో ప్రస్తావించారు.
భారతీయ జాలర్ల అరెస్ట్తో రాష్ట్రంలోని ఆ సామాజిక వర్గం ఆందోళనలకు దిగుతున్నాయని, దాంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. అలాగే శ్రీలంక జైళ్లలో మగ్గుతున్న 90 మంది భారతీయ జాలర్ల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని జయలలిత ప్రధాని మన్మోహన్కు రాసిన లేఖలో పేర్కొన్నారు.