ఉద్యోగం చేసి పోషిస్తేనే.. ఇంట్లోకి! | domestic violence:husband not allowing wife into home | Sakshi
Sakshi News home page

ఉద్యోగం చేసి పోషిస్తేనే.. ఇంట్లోకి!

Published Fri, Oct 30 2015 3:33 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

ఉద్యోగం చేసి పోషిస్తేనే.. ఇంట్లోకి! - Sakshi

ఉద్యోగం చేసి పోషిస్తేనే.. ఇంట్లోకి!

*  భార్యను వేధిస్తూ ఇంట్లోకి రాకుండా తాళం వేసిన వైనం
*  భర్త ఇంటి ఎదుట కొడుకుతో నిరసన తెలిపిన భార్య
 ఆదిలాబాద్ క్రైం: సాధారణంగా ఏ భర్త అయినా.. ఉద్యోగంచేసి తన భార్య, పిల్లలను పోషించేందుకు ఇష్టపడతాడు. కానీ.. దీనికి వ్యతిరేకంగా భార్య ఉద్యోగం చేసి తనను పోషిస్తేనే ఇంట్లోకి అడుగుపెట్టాలంటూ ఓ భర్త తన భార్యను ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేసిన ఘటన గురువారం ఆదిలాబాద్‌లో చోటు చేసుకుంది. బాధితురాలు లక్ష్మీదుర్గ కథనం ప్రకారం.. స్థానిక రాంనగర్ కాలనీకి చెందిన బాయి లక్ష్మణ్‌రావు కుమారుడు కిరిటీతో విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన లక్ష్మీదుర్గకు 2010 ఆగస్టు 14న వివాహం జరిగింది. లక్ష్మణ్‌రావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అయినా.. ఉద్యోగరీత్యా కొన్నేళ్లుగా ఆదిలాబాద్‌లో ఉంటున్నారు. పెళ్లైన కొంత కాలానికే భర్తతోపాటు, అత్తామామలు, బావ, తోటికోడళ్లు లక్ష్మిని ఉద్యోగం చేయాలంటూ వేధింపులకు గురిచేసేవారు.

తమ కొడుకు పోషించలేడని, నీవే పోషించాలంటూ అత్తామామలు దాడులు చేసేవారని లక్ష్మి వాపోయింది. 2012లో బాబుకు జన్మనిచ్చిన తర్వాత రెండు నెలలపాటు చూసేందుకు కూడా రాలేదు. తానే ఐదు నెలల తర్వాత బాబును తీసుకొని ఆదిలాబాద్‌కు వచ్చానని, అప్పటి నుంచి తనను గదిలో బంధించి చిత్రహింసలు పెట్టేవారని పేర్కొంది. చుట్టుపక్కల వారు సహాయం చేస్తే వారిని కూడా బెదిరించి తనను ఇంట్లోంచి గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత తమ గ్రామంలో పోలీసు కేసు పెట్టడంతో అక్కడి పోలీసు కౌన్సెలింగ్ ఇవ్వగా తన భర్త కిరిటీ తనను బాగా చూసుకుంటానని చెప్పడంతో ఆదిలాబాద్‌కు వచ్చానని, వేధింపులు ఆపకపోవడంతో మళ్లీ ఇంటికి వెళ్లిపోయానన్నారు.

ఎన్ని రోజులు భర్తను విడిచి తల్లిగారి ఇంట్లో ఉంటా.. అందుకే ఇప్పుడు వస్తే ఇంట్లోకి రానివ్వకుండా తాళం వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పెద్ద కోడలు ఎక్కువ డబ్బు తెచ్చింది.. నువ్వే తక్కువ తెచ్చావంటూ తనను వేధించేవారని చెప్పింది. ఉద్యోగం చేయడమే కాకుండా.. మరిన్ని డబ్బులు తీసుకురావాలంటూ తనను కొట్టేవారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. రూ. 5 లక్షలతోపాటు అన్ని లాంఛనాలు ఇచ్చినప్పటికీ మరిన్ని డబ్బులు తేవాలని ఒత్తిడి చేశారని వివరించింది. పెళ్లి సమయంలో తన భర్త ఎంఏ చదివాడని అబద్ధం చెప్పి మోసం చేశారని లక్ష్మి తెలిపారు. తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని భర్త ఇంటిఎదుటే బైఠాయించిన ఆమె, ఆ తర్వాత మహిళా పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement