
ట్రంప్‌పై మళ్లీ దుమారం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రచార కర్తలు, సలహాదారులు తరచుగా రష్యా ఇంటెలిజెన్స్ విభాగం అధికారులతో సంప్రతింపులు జరిపినట్లు..
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన ప్రచార కర్తలు, సలహాదారులు తరచుగా రష్యా ఇంటెలిజెన్స్ విభాగం అధికారులతో సంప్రతింపులు జరిపినట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెల్సింది. ఇరువర్గాల మధ్య జరిగిన సంభాషణలను మధ్యలో ట్రేస్ చేశామని, అయితే ఆ సంభాషణల తీవ్రత ఎంతుందో తెలసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేరు బహిర్గతం చేయడం ఇష్టంలేని ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
ట్రంప్ ఎన్నికల ప్రచార మేనేజర్ పాల్ మనఫోర్ట్, భద్రతా సలహాదారు మైఖేల్ ఫిన్‌తో కూడా రష్యా ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు తరచు సంప్రతింపులు జరిపినట్లు తేలిందని, ఈ విషయమై ఇంకా లోతుగా దర్యాప్తు జరపాల్సి ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఓ రష్యా రాయబారితో జరిపిన చర్చల గురించి తనకు తెలియజేయలేదన్న కారణంగా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫిన్‌ను ట్రంప్ ఇటీవల తొలగించారు. ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ వర్గం కషి చేసిందని, అందుకే కృతజ్ఞతగా పుతిన్ పట్ల ట్రంప్ మెతక వైఖరి అవలంబిస్తున్నారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ సలహాదారులకు, రష్యా అధికారులకు మధ్య తరచుగా సంప్రతింపులు జరిగాయన్న అంశానికి ప్రాధాన్యత చేకూరింది.
అయితే ఈ తాజా ఆరోపణలను ట్రంప్ బుధవారం నాడు ట్విట్టర్‌లో ఖండించారు. రష్యా అధికారులతో తన సలహాదారులెవరికి సన్నిహిత సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. హిల్లరీ క్లింటన్ ఎన్నికల్లో ఓడిపోవడానికి సాకుగా ఇలాంటి ఆరోపణలను ఆశ్రయిస్తారని ట్రంప్ ఆరోపించారు. ఇదే విషయమై మైఖేల్ ఫిన్‌ను మీడియా సంప్రతించగా, ఈ ఆరోపణలు అభూత కల్పనలని కొట్టి వేశారు. తనకు సంబంధించినంత వరకు రష్యా అధికారులతో ఎలాంటి సంప్రతింపులు జరపలేదని ఆయన అన్నారు.