మిషెల్లీ భుజం మీదుగా హిల్లరీపై తూటాలు
ఫ్లెచర్: మహిళలపై దురుసు వ్యాఖ్యానాలకు ముందుండే డోనాల్డ్ ట్రంప్ మరోసారి అదేపనిచేశాడు. ఫస్ట్ టేడీ మిషెల్లీ ఒబామా భుజం మీదుగా ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై మాటల తూటాలు పేల్చాడు. 2008లో డెమోక్రాటిక్ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన సందర్భంలో మిషెల్లీ.. హిల్లరీని దారుణంగా తిట్టిపోసినవైనాన్ని ట్రంప్ తిరగదోడాడు.
2007లో డెమోక్రటిక్ అభ్యర్థిత్వం కోసం ఒబామా, హిల్లరీ క్లింటన్ ను పోటీపడిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో తన భర్త ఒబామా తరఫున ప్రచారం చేసిన మిషెల్లీ.. 'ఇంటిని చక్కదిద్దుకోలేని హిల్లరీ క్లింటన్.. వైట్ హౌస్ ను, దేశాన్ని సరిగా పాలించగలదా?'అని ప్రత్యర్థిపై పంచ్ లు విసిరింది. నార్త్ కరోలినా రాష్ట్రం ఫ్లెచర్ పట్టణంలో శుక్రవారం జరిగిన ప్రచార కార్యక్రమంలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ నాటి విషయాలను గుర్తుచేశారు. 'ఫ్రెండ్స్.. ప్రస్తుత పాలకులంతా పిల్లకాకులు, పరాజితులు. వీళ్ల తీరు ఎలా ఉంటుందంటే.. 2007లో హిల్లరీని తిట్టిపోసిన మిషెల్లీ ఇప్పుడు నన్ను విమర్శిస్తోంది. నాటి మిషెల్లీ వ్యాఖ్యలు బిల్ క్లింటన్ అక్రమ సంబంధాల నేపథ్యంలో చేసినవేనని జనం చర్చించుకున్నారు. ఇవీ.. మనల్ని పాలిస్తున్నవాళ్ల బతుకులు' అని వ్యంగ్యాస్త్రాలు వేశారు.
పోలింగ్ తేదీ(నవంబర్ 8) దగ్గర పడుతుండటంతో డెమోక్రాట్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తమ పార్టీలు కీలకంగా భావించే రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని సర్వేల ప్రకారం అధ్యక్ష పీఠం కైవసం చేసుకునే అవకాశాలు హిల్లరీకి 47 శాతం, ట్రంప్ కు 43 శాతం ఉన్నాయి. దీంతో వచ్చే 18 రోజుల్లో హిల్లరీపై ట్రంప్ మరిన్ని కంపు వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది.