మహిళలను విస్మరించిన ట్రంప్
Published Fri, Jan 13 2017 7:55 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM
అమెరికా కొత్త అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్న డోనాల్డ్ ట్రంప్ అత్యంత ధనవంతులను తన క్యాబినెట్‌లోకి తీసుకోవడమే కాకుండా శ్వేత జాతీయులకే ఎక్కువ ప్రాధన్యం ఇచ్చారు. మైనారిటీలు, మహిళలను చిన్నచూపు చూశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ తర్వాత మైనారిటీలకు, మహిళలకు తక్కువ స్థానాలు కల్పించిందీ ట్రంప్ మాత్రమే. నాడు రోనాల్డ్ రీగన్ తన క్యాబినెల్‌లో ఒక మహిళకు, ఒక మైనారిటీ వ్యక్తికి స్థానం కల్పించగా.. ట్రంప్ తన 21 మంది క్యాబినెట్‌లోకి ఇద్దరు శ్వేతజాతి మహిళలను, ఇతర జాతులకు చెందిన ఇద్దరు మహిళలతో మొత్తం నలుగురు మహిళలను తీసుకున్నారు. ఒక్క నల్ల జాతీయుడికి మాత్రమే అవకాశం కల్పించారు.
అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న బరాక్ ఒబామా నలుగురు శ్వేతజాతి మహిళలు సహా మొత్తం ఏడుగురు మహిళలకు క్యాబినెట్‌లో స్థానం కల్పించడమే కాకుండా మైనారిటీ జాతులకు చెందిన ఏడుగురు మగవాళ్లకు క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. జార్జి డబ్ల్యు బుష్ తన క్యాబినెట్‌లో ముగ్గురు శ్వేతజాతి మహిళలు సహా నలుగురు మహిళలకు, ఐదుగురు మైనారిటీ జాతులకు చెందిన వ్యక్తులకు స్థానం కల్పించారు. ఇక బిల్ క్లింటన్ నలుగురు శ్వేతజాతీయ మహిళలు సహా ఆరుగురు మహిళలకు, ఆరుగురు మైనారిటీ జాతులకు చెందిన మగవారికి తన క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. సీనియర్ జార్జి బుష్ ఇద్దరు శ్వేత జాతీయ మహిళలకు, ముగ్గురు మైనారిటీలకు క్యాబినెట్‌లో స్థానం కల్పించారు. డోనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్‌లోకి మరో ఇద్దరు వ్యక్తులను నామినేట్ చేయాల్సి ఉంది. ఏ జాతుల నుంచి వారిని ఎంపిక చేస్తారో చూడాలి.
Advertisement
Advertisement