'ఎస్' అన్నారో.. మీ జేబు గుల్ల!
'ఎస్' అన్నారో.. మీ జేబు గుల్ల!
Published Mon, Feb 27 2017 2:17 PM | Last Updated on Sat, Aug 25 2018 4:51 PM
ఫోన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వాళ్లు అడిగిన ప్రశ్నలకు 'ఎస్' అని చెబుతున్నారా.. కాస్త జాగ్రత్త పడండి. ఎందుకంటే, అలా చెప్పారంటే త్వరలోనే మీ జేబు గుల్ల అయిపోయే ప్రమాదం ఉందట. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒక పెద్ద ఫోన్ స్కాం జరుగుతోందట. అందులో భాగంగా అవతలి వాళ్లు ముందు ఏదో ఒకటి మాట్లాడి, 'నేను మాట్లాడేది మీకు బాగానే వినిపిస్తోందా' అని అడుగుతున్నారు. అలా అడిగినప్పుడు మనం 'ఎస్' అని సమాధానం ఇస్తే, ఆ ఒక్క మాటను జాగ్రత్తగా వాళ్లు రికార్డు చేసి పెట్టుకుని, కావల్సిన చోట కట్ పేస్ట్ చేసుకుని వాడేసుకుంటున్నారట. దాని ఆధారంగా మన దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బు నొక్కేయడానికి కావల్సినన్ని ప్లాన్లు అమలుచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అమెరికా, బ్రిటన్ దేశాల్లో వెలుగు చూశాయి.
వాళ్లు తమ వస్తువులు లేదా సేవలను మనకు ఇచ్చినట్లుగా వాయిస్ రికార్డు చేసి, అవి మనకు అందినట్లు, దానికి గాను డబ్బు చెల్లించడానికి మన అంగీకారం కోరినట్లుగా ముందు వాయిస్ రికార్డులో ఉంటుంది. ఆ తర్వాత మనం ఎప్పుడో చెప్పిన 'ఎస్' అనే సమాధానాన్ని ఇక్కడ వాడుకుంటారు. ఒకవేళ మనం ఆ తర్వాత మనకు ఆ వస్తువులు గానీ, సేవలు గానీ అందలేదని.. అందువల్ల డబ్బు చెల్లించబోమని చెప్పినా, ముందు చెప్పిన సమాధానం తాలూకు ఆడియో క్లిప్ ఆధారంగా.. మన మీద కేసులు వేసి మరీ డబ్బు దండుకుంటున్నారట. చాలావరకు కంపెనీలు తమ వ్యాపారాల కోసం ఫోన్లోనే వాయిస్ సిగ్నేచర్లు తీసుకుంటున్నాయి. అలాంటి వాటికి ఇప్పుడు ఈ స్కాంస్టర్లతో పెద్ద ముప్పే పొంచి ఉందని చెబుతున్నారు. కాబట్టి, అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మాత్రం 'ఎస్' అనే సమాధానాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చెప్పొద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Advertisement
Advertisement