'చెప్పుకుంటూ పోతే వారివన్నీ స్కాంలే'
వైజాగ్ : యూపీఏ హయాంలో నెలకొన్న స్కాంలను ఎత్తిచూపుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై భారతీయ జనతాపార్టీ(బీజేపీ) మండిపడింది. మన్మోహన్ పాలనలో అన్ని స్కాంలే జరిగాయని ఆరోపించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి తాము ఎలాంటి ఉపదేశాలు స్వీకరించాల్సినవసరం లేదని తేల్చిచెప్పింది. నరేంద్రమోదీ హయాంలోని ప్రభుత్వం దేశానికి స్కాం-ఫ్రీ పాలన అందిస్తుందని పేర్కొంది. ''నేడు కొంతమంది కాంగ్రెస్ నేతలు మాజీ ప్రధాని మన్మోహన సింగ్ ఇచ్చే సూచనలు తీసుకోవాలంటున్నారు. అయితే మన్మోహన్ సూచనలు తీసుకోవాలని ఆదేశించే ముందు ఆయన పాలనలో ఏం చేశారో ఓసారి గుర్తుతెచ్చుకోవాలి? ఆయన అధ్యక్షతన దేశచరిత్రలోనే కాంగ్రెస్ ప్రభుత్వం భారీ దోపిడికి పాల్పడింది. కోల్ స్కాం, 2జీ స్కాం, కామన్ వెల్త్ స్కాం, షుగర్ స్కాం, యూరియా స్కాం, డిఫెన్స్ స్కాం, అగస్టా హెలికాప్టర్ స్కాం... ఇలా చెప్పుకుంటే పోతే సాయంత్రం వరకు వారి స్కాంల గురించి చెప్పవచ్చు'' అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్పై విరుచుకుపడిన వెంకయ్యనాయుడు, దేశాన్ని మోసం చేసి ఆయన భారీ దోపిడికి పాల్పడ్డారని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే చాలా స్కాంలు జరిగినట్టు వెల్లడించారు. అలాంటి అవినీతి వ్యక్తులు, పార్టీ, ప్రభుత్వాల నుంచి తాము ఉపదేశాల తీసుకోవాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ స్కాంల రహిత పాలనను దేశానికి అందిస్తున్నారని చెప్పారు. నో స్కాం, నో స్కాండల్, నో బ్లాక్ మార్కెట్... ఇది మోదీ ప్రభుత్వ గొప్పతనమని పేర్కొన్నారు. పెద్ద నోట్లను రద్దుచేయడం వ్యవస్థీకృత మోసమని విమర్శించిన మన్మోహన్ కామెంట్లను వెంకయ్యనాయుడు తిప్పికొట్టారు.