సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ రెడ్డప్పరెడ్డి. చిత్రంలో పద్మనాభరెడ్డి, రావు చెలికాని
హైదరాబాద్: అన్ని ప్రభుత్వ విభాగాల్లో అవినీతి బాగా పెరిగిందని, అవినీతికి పాల్పడే ఉద్యోగులకు, అధికారులకు సాక్షాత్తు సచివాలయమే అండగా మారిందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సుపరిపాలన వేదిక) ఆందోళన వ్యక్తం చేసింది. అవినీతికి పాల్పడుతూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన అధికారులకు సైతం సచివాలయం మద్దతుగా ఉందని, నిందితులపై ఎలాంటి చర్యలు లేకపోవడమే కాకుండా పదోన్నతులు కూడా లభిస్తున్నాయని ఫోరమ్ కార్యదర్శి పద్మనాభరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. శనివారం ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు జస్టిస్ రెడ్డప్పరెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ రావు చెలికానితో కలసి ఆయన మాట్లాడారు.
అనేక రూపాల్లో అవినీతి వ్యవస్థ బలంగా వేళ్లూనుకొని కొనసాగుతోందని అన్నారు. లిక్కర్ మాఫియాలో 1,100 మంది పాత్రధారులుగా ఉన్నప్పటికీ వారిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉంటే ఉద్యోగిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని, అక్రమాస్తులను సీజ్ చేయాలని, అయితే, ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. మియాపూర్ భూ కుంభకోణం, నయీమ్ కేసులను సైతం ప్రభుత్వం నీరుగార్చిందని ఆరోపించారు. ‘నయీం అక్రమ సంపాదనను రెండు కౌంటింగ్ మిషన్లతో దినమంతా లెక్కించారు. కానీ పోలీసులు మాత్రం రూ.4.30 లక్షలు మాత్రమే లభించినట్లు లెక్క తేల్చారు’అని విస్మయం వ్యక్తం చేశారు.
అటకెక్కిన ట్రిబ్యునల్
అవినీతికి పాల్పడుతూ దొరికిన అధికారులు, ఉద్యోగులను విచారించి చర్యలు చేపట్టవలసిన ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్(టి.డి.పి.)కి గత పదేళ్లుగా న్యాయాధికారిని నియమించలేదని జస్టిస్ రెడ్డప్పరెడ్డి తెలిపారు. మరోవైపు ప్రభుత్వం సైతం అవినీతి అధికారుల విచారణకు నిరాకరిస్తోందని, గత రెండేళ్లలో ఇలా 50 కేసులను నిరాకరించారని పేర్కొన్నారు. ‘అవినీతికి పాల్పడే అధికారులను చెప్పుతో కొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ తన కళ్ల ముందే సచివాలయంలో బాహాటంగా అవినీతి జరుగుతున్నా స్పందించకపోవడం విచిత్రంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు అవినీతి అధికారులపై విచారణ జరిపే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కూడా పనిచేయడం లేదని, 96 కేసులు దీని పరిధిలో పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు.
అవినీతి అధికారులపై శాఖాపరమైన విచారణ కూడా జరగడం లేదన్నారు. దీంతో ఎనిమిదేళ్ల క్రితం కేసులు కూడా ఇప్పటికీ అతీగతీ లేకుండా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘అవినీతి అధికారులపైన విజిలెన్స్ కమిషన్ ఇచ్చే నివేదికలను ప్రభుత్వం అంగీకరించని పక్షంలో దానిపై చర్చించాలి. తాము ఎందుకు అంగీకరించడం లేదో ప్రభుత్వం సహేతుకంగా వివరించాలి. కానీ ఇప్పటి వరకు ఒక్క కేసుపైన కూడా అలాంటి చర్చ జరగలేదన్నారు. అసలు విజిలెన్స్ కమిషన్ నివేదికలతో విబేధించే కేసులు సీఎం దగ్గరకు కూడా వెళ్లడం లేదని చెప్పారు. పాలనలో అవినీతి తొలగిపోవాలంటే మొదట సచివాలయంలోనే ప్రక్షాళన జరగాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment