
‘చెప్పు’కోలేని చోట పెట్టినా పట్టేశారు!!
హౌరా: బంగారం అక్రమ రవాణాలో స్మగ్లర్లు వినూత్న పోకడలు పోతున్నారు. పుత్తడిని అక్రమంగా తరలించేందుకు కొత్తకొత్త పద్ధతులు కనిపెడుతూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లోని హౌరా రైల్వే స్టేషన్ లో భారీగా బంగారం పట్టుబడింది. చెప్పుల్లో(పాదరక్షలు) దాచిపెట్టి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న 28 కిలోల బంగారంను డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 8.3 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారంలో 8 మంది నిందితులను అధికారులు అరెస్ట్ చేశారు. ఈ బంగారం ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు, దీని వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.
కాగా, బుధవారం ఇదే విధంగా బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఢిల్లీ విమానాశ్రయంలో ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నిందితులు స్లిప్పర్స్ అడుగు భాగంలో పుత్తడి కడ్డీలు అతికించుకుని తరలించేందుకు ప్రయత్నించి అధికారులకు దొరికిపోయారు. స్వాధీనం చేసుకున్న 938 గ్రాముల బంగారం మార్కెట్ ధర ప్రకారం 26.96 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.