
తప్పతాగి మెట్రో రైల్లో తూలిన పోలీసు.. సస్పెండ్
న్యూఢిల్లీ: తప్ప తాగి ఢిల్లీ మెట్రో రైల్లోకనిపించిన పోలీసు అధికారి వీడియో ఒకటి సంచలనం సృష్టించింది. దీనిపై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు తలెత్తడంతో ఆ పోలీసు అధికారిని గుర్తించిన పైఅధికారులు వెంటనే అతడిని సస్పెండ్ చేశారు. తేదీ, సమయం లేకుండా ఉన్న 36 సెకండ్ల నిడివిగల వీడియో ఒకటి సామాజిక అనుసంధాన వేదికలైన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీనిని మొత్తం ఆరువేలమంది షేర్ చేసుకున్నారు. అక్కడా ఇక్కడా చేరి చివరికి అందరికీ ఈ వీడియో తెలిసిపోయింది.
ఈ వీడియోలో ఫుల్లుగా తాగిన పోలీసు అధికారి యూనిఫాం టక్ కూడా చేసుకోకుండా నిర్లక్ష్యంగా తూలుతూ కనిపించాడు. బోగీ మధ్యలో నిల్చుని అటూఇటూ ఊగుతూ కనిపించాడు. అజాద్పూర్ స్టేషన్లో ఆగేందుకు ట్రైన్ బ్రేక్ వేయగా అతడు ఒక్కసారిగా కిందపడి ఈడ్చుకుపోయే పరిస్థితి తలెత్తింది. తోటీ ప్రయాణీకులు అతడిని రక్షించడంతో ఓ రకంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ వీడియో నెట్లో హల్ చల్ చేయడంతో గుర్తించిన ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు.