ఆదిశేషు.. అనంత బంగారం
ఎక్సైజ్ శాఖ ఏసీ బ్యాంకు లాకర్లలో రూ. 2.50 కోట్లకు పైగా బంగారం, వెండి
విజయవాడ సిటీ: ఆబ్కారీ శాఖ సహాయ కమిషనర్ మామిళ్లపల్లి ఆదిశేషు బ్యాంక్ లాకర్లలో కిలోల కొద్ది బంగారం, వెండిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు బ్యాంకుల్లో బినామీల పేరిట ఉన్న లాకర్లలో గురువారం ఏసీబీ అధికారులు వీటిని గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సహాయ కమిషనర్ ఆదిశేషు ఆస్తులపై ఏసీబీ డీఎస్పీ ఆదిరెడ్డి రమాదేవి ఆధ్వర్యంలో బుధవారం నుంచి విజయవాడ, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లో సోదాలు జరుగుతున్నాయి.
తొలిరోజు వేర్వేరు ప్రాంతాల్లోని రూ.80 కోట్ల విలువైన ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రెండోరోజు సోదాల్లో భాగంగా స్థానిక గవర్నర్‌పేటలోని ఐఎన్‌జీ వైశ్యాబ్యాంక్ లాకర్‌ను తనిఖీ చేశారు. అక్కడ 4.5 కిలోల వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. రాత్రి పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులోని ధనలక్ష్మి బ్యాంక్‌లో ఆదిశేషు బంధువు బండి జగన్మోహన తాతారావు పేరిట ఉన్న లాకర్‌ను తనిఖీ చేశారు. అందులో సుమారు ఏడు కిలోల బరువైన బంగారు, వజ్రాల నగలు అధికారులు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. 2.50 కోట్ల వరకు ఉండొచ్చనేది అధికారుల అంచనా.
ఇదిలా ఉండగా మొగల్రాజపురంలోని సున్నపు బట్టీల సెంటర్‌లో ఆదిశేషుకు మరో సొంత ఇల్లు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు రెండోరోజు గుర్తించారు. అక్కడ రూ. 30 లక్షల విలువైన చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఉండటాన్ని బట్టి వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.