ఆర్‌బీఐపై మొట్టికాయలేసిన ఈసీ
న్యూఢిల్లీ: నగదు విత్ డ్రా లిమిట్ పెంచాలన్న ప్రతిపాదనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరస్కరించడంపై ఎలక్షన్ కమిషన తీవ్ర అందోళన వ్యక్తం చేసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు వారం నగదు ఉపసంహరణ పరిమితి పెంపుపై ఆర్ బీఐ వైఖరిపై మండిపడిన ఈసీ మళ్లీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు మరో లేఖ రాసింది.
నగదు విత్ డ్రా పరిమితులు ప్రజాస్వామ్య ప్రక్రియ దెబ్బతీసేలా ఉండకూడదని మొట్టికాయలేసింది. ఈ చర్య సరైంది కాదనీ, అంగీకరించలేమని ఈసీ తెలిపింది. కనీసం చట్టబద్ధమైన ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థులకు నగదు విత్ డ్రాలపై నిరోధం ఉండకూడదని సూచించింది. నగదు ఉపసంహరణకు అనుమతి నివ్వాలని మరోసారి కోరింది. ప్రస్తుతం వారానికి ఉన్న రూ. 24 వేల పరిమితిని రూ. 2లక్షలకు పెంచాల్సిందేనని తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం ఆయా అభ్యర్థులకు రూ. 28 లక్షల దాకా ఖర్చుచేసే హక్కు వుందని స్పష్టం చేసింది. పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆర్‌బీఐ తొందరపడిందని తన లేఖలో పేర్కొంది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు క్యాష్ విత్ డ్రా లిమిట్ ను పెంచేందుకు అంగీకరించాలని ఈసీ ఆర్‌బీఐకి లేఖ రాసింది. రాసింది. ఎన్నికల సందర్భంగా నగదు ద్వారా మాత్రమే చెల్లించాల్సిన అనేక బిల్లులు ఉన్నాయని పేర్కొంది. అభ్యర్థులు నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో స్పందించిన ఈసీ ఆర్‌బీఐని ముందు ఒక లేఖ రాసింది. నిస్పాక్షికమైన ఎన్నికలు జరగాలంటే అభ్యర్ధుల విత్ డ్రా పరిమితిని పెంచాలంటూ ఈ లేఖలో పేర్కొంది ఈసీ. అయితే ఈ అభ్యర్థనను ఆర్ బీఐ తిరస్కరించిన సంగతి తెలిసిందే.