
టాటాకు ఈడీ షాక్?
మార్కెట్ వర్గాల్లో సంచలనం రేపిన టాటా సన్స్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ తొలగింపు వ్యవహారంలో టాటాలకు మరో షాక్ తగలనుంది. కార్పొరేట్ పాలన నియమాల ఉల్లంఘనల ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఈడీ రంగంలోకి దిగినట్టు సమాచారం.
ముంబై: మార్కెట్ వర్గాల్లో సంచలనం రేపిన టాటా సన్స్ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ తొలగింపు వ్యవహారంలో టాటాలకు మరో షాక్ తగలనుంది. కార్పొరేట్ పాలన నియమాల ఉల్లంఘనల ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు రంగంలోకి దిగినట్టు సమాచారం. టాటా సన్స్ బోర్డుకు రాసిన లేఖలో మిస్త్రీ గ్రూపు కార్యకలాపాలకు సంబంధించి నైతికత, రతన్ టాటాపైనా, కొందరు బోర్డు సభ్యులపైనా విమర్శనాస్త్రాలు సంధించిన అంశాలపై విచారించనుందని ఇండియా టుడే శనివారం రిపోర్ట్ చేసింది.
మిస్త్రీ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు ఈడీ అధికారి వ్యాఖ్యానించినట్టు పేర్కొంది. మలేషియా ఎయిర్ లైన్స్ ఎయిర్‌ఏషియా, సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో జాయింట్ వెంచర్ల (జేవీ) ఏర్పాటును వ్యతిరేకించినందుకే ఇదతా జరిగిందని, దాదాపు రూ.22 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలినట్లు మిస్త్రీ తన లేఖలో పేర్కొన్నారు. ఈ ఆరోపణలపైనా ఈడీ విచారణ చేపట్టనుంది.
మరోవైపు టాటా గ్రూప్ ఈ పరిణామాలపై ఇప్పటికే బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి స్పందించారు. టాటా గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తుకు మల్టి-ఏజెన్సీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖరాశారు. హోల్డర్లు, రుణాలిచ్చిన బ్యాంకులు, ఉద్యోగులు, ఇతర స్టేక్ హోల్డర్లలో తీవ్రమైన ఆయోమయం నెలకొందని , వెంటనే దీనిపై స్పష్టత ఇవ్వాలని ప్రాక్సీ అడ్వైజరీ సంస్థ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అడ్వైజరీ సర్వీసెస్ ఇండియా (ఐఐఎఎస్) వ్యాఖ్యానించింది. అటు టాటాల ఎయిర్‌ఏషియా లావాదేవీలకు సంబంధించి అన్ని విషయాలు పరిశీలిస్తున్నామని, చట్ట ప్రకారం ముందుకెళ్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి ప్రకటించారు.