
ఒపీనియన్ పోల్స్ నిషేధించండి: ఈసీ
న్యూఢిల్లీ: తాజాగా వివిధ రాజకీయ పార్టీల మద్దతు లభించిన నేపథ్యంలో.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం విధించాల్సిందిగా సూచిస్తూ ఎన్నికల కమిషన్ కేంద్ర న్యాయశాఖకు లేఖ రాసింది. ఒపీనియన్ పోల్స్ విషయంలో తాము చేసిన ప్రతిపాదనకు ఐదు జాతీయ పార్టీలు, 10 ప్రాంతీయ పార్టీలు సహా మొత్తం 15 పార్టీలు స్పందించాయని, మెజారిటీ పార్టీలు నిషేధాన్ని సమర్థించాయని తెలిపింది. ఒపీనియన్ పోల్స్‌పై తాజాగా అభిప్రాయాలు కోరుతూ తాము రాసిన లేఖకు ఈ పార్టీలు స్పందించాయని పేర్కొంది.
ఈ మేరకు పార్టీల అభిప్రాయాలను న్యాయశాఖకు పంపిన ఈసీ.. ఈ అంశంపై 2004 ఏప్రిల్ 6న కూడా పార్టీలతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తేదీ నుంచి ఒపీనియన్ పోల్స్ ఫలితాలను ప్రచురించడంపై నిషేధం విధించాలన్న అంశంపై పార్టీలు అప్పట్లో ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని వివరించింది. పార్టీల అభిప్రాయాలను పరిశీలించినట్టైతే ఒక్క బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ ఒపీనియన్ పోల్స్‌పై నిషేధం విధించాలని లేదా పరిమితులు విధించాలని కోరాయి. ఎన్నికలకు ముందు ఒపీనియన్ పోల్స్ నిర్వహణపై నిషేధం లేదా పరిమితులు విధించాలని కోరిన ప్రముఖ పార్టీల్లో కాంగ్రెస్‌తో పాటు సీపీఎం, బీఎస్పీ, ఎన్సీపీ, ఎస్పీ, ఏఐఏడీఎంకే, డీఎంకే వంటివి ఉన్నాయి.