శశికళ వర్గానికి ఎన్నికల కమిషన్ ఝలక్
జయలలిత మరణంతో ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలు బాగా వేడెక్కాయి. శశికళ వర్గం నుంచి టీటీవీ దినకరన్, పన్నీర్ సెల్వం వైపు నుంచి కురువృద్ధుడు మధుసూదనన్, ఇంకా దీపా జయకుమార్, బీజేపీ, డీఎండీకే.. ఇలా బహుముఖ పోటీతో అక్కడ రాజకీయాలు మంచి రంజుగా ఉన్నాయి. రెండాకుల గుర్తు కోసం అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు విపరీతంగా పోరాడాయి. దాంతో దాన్ని ఎవరికీ ఇవ్వకుండా ఒకరికి టోపీ, మరొకరికి కరెంటు స్తంభం ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, శశికళ వర్గం మాత్రం సోషల్ మీడియా ప్రచారంలో రెండాకుల గుర్తును విచ్చలవిడిగా వాడేస్తోందట. ఈ విషయం తెలిసి ఎన్నికల కమిషన్ తీవ్రంగా మండిపడింది.
పార్టీ వెబ్‌సైట్‌తో పాటు సోషల్ మీడియా అకౌంట్లు అన్నింటి నుంచి వెంటనే రెండాకుల గుర్తును తీసేయాలని ఆదేశించింది. అలాగే, అన్నాడీఎంకే పేరు, గుర్తును ఉపయోగించకూడదని తామిచ్చిన ఉత్తర్వులను ఎందుకు ఉల్లంఘించారో వివరించాలంటూ అందుకు గురువారం ఉదయం వరకు సమయం ఇచ్చింది. ఇలా అన్నా డీఎంకే గుర్తును ఇష్టం వచ్చినట్లు ఉపయోగించడం ఐపీసీ 171జి సెక్షన్ ప్రకారం ఎన్నికల నేరమే అవుతుందని స్పష్టం చేసింది. రెండాకుల గుర్తును ప్రింట్, ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ మీడియాలలోను, పార్టీ వెబ్‌సైట్, ఫేస్‌బుక్, ట్విట్టర్ లాంటి చోట్ల వాడటాన్ని వెంటనే ఆపేయాలని తెలిపింది. ఈనెల 9వ తేదీన ఆర్కేనగర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో శశికళ వర్గానికి టోపీ, పన్నీర్ సెల్వం వర్గానికి విద్యుత్ స్తంభం గుర్తులు వచ్చాయి.