విద్యుత్ చార్జీలను మేమే నిర్ణయిస్తాం
డిస్కంలకు ఈఆర్సీ హెచ్చరిక
- టారిఫ్ ప్రతిపాదనలివ్వకపోవడంపై అసంతృప్తి
- 23లోగా సమర్పించాలంటూ డెడ్‌లైన్
- వచ్చేయేడు డిస్కంల ఆదాయ లోటు రూ. 9,824 కోట్లు
- రూ. 2 వేల కోట్ల చార్జీల పెంపునకు డిస్కంల విజ్ఞప్తి
- సబ్సిడీని రూ. 8 వేల కోట్లకు పెంచాలని వినతి
- ఎటూ తేల్చని రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను సమర్పించకుండా పంపిణీ సంస్థ (డిస్కం)లు మూడు నెలలుగా తాత్సారం చేస్తున్నాయంటూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) సీరియస్ అయింది. మూడుసార్లు గడువు పొడిగించినా టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 23లోగా ప్రతిపాదనలు సమర్పించకుంటే తమంత తాముగా (సుమోటో) నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు డిస్కంలకు లేఖ రాసింది.
‘‘2003 విద్యుత్ చట్టం ప్రకారం 2017–18 వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్), రిటైల్ టారిఫ్ ప్రతిపాదనలను 2016 నవంబర్ 30లోగా సమర్పించాల్సి ఉండగా ఏఆర్‌ఆర్ మాత్రమే సమర్పించాయి. పలు కారణాలు చూపుతూ పదేపదే టారిఫ్ ప్రతిపాదనల సమర్పణకు గడువు పొడిగింపు కోరాయి. మూడుసార్లు పొడిగించాం. చివరి పొడిగింపు గడువూ గత జనవరి 23తో ముగిసింది. అయినా ప్రతిపాదనల సమర్పణలో డిస్కంలు విఫలమయ్యాయి. మళ్లీ ఈ నెల 28 వరకు పొడిగింపు కోరాయి. దీనిపై మేం అసంతృప్తిగా ఉన్నాం. 23లోగా టారీఫ్ ప్రతిపాదించకపోతే నేషనల్ టారిఫ్ పాలసీలోని 8.1 (7) నిబంధన ప్రయోగించి సుమోటోగా నిర్ణయం తీసుకుంటాం. డిస్కంలు సమర్పించిన 2015–16, 2016–17, 2017–18 ఏఆర్‌ఆర్ నివేదికల్లోని సమాచారం ఆధారంగా 2017–18 రిటైల్ సప్‌లై టారిఫ్‌ను నిర్ణయిస్తాం’’ అని లేఖలో స్పష్టం చేసింది.
ఫుల్ కాస్ట్ టారిఫ్
2017–18లో రూ.9,824 కోట్ల ఆదాయ లోటు ఉంటుందని డిస్కంలు ఇప్పటికే అంచనా వేశాయి. ఇందులో రూ.2 వేల కోట్లను చార్జీల పెంపు ద్వారా రాబట్టాలని, మిగతా రూ.7,800 కోట్లను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం భరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతిపాదించాయి. ఈ ఏడాది బడ్జెట్లో రూ.4,500 కోట్ల విద్యుత్ సబ్సిడీలు కేటాయించారు. దీన్ని వచ్చే బడ్జెట్లో ఏకంగా రూ.8 వేల కోట్లకు పెంచాలని కోరడంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది. ప్రభుత్వ సబ్సిడీ ఎంతో తెలియక డిస్కంలు పదేపదే టారిఫ్ ప్రతిపాదనలను వాయిదా వేసుకుంటున్నాయి. గడువులోగా టారిఫ్ ప్రతిపాదించకపోతే ఈఆర్సీ సుమోటోగా మొత్తం రూ.9824 కోట్ల మేరకు (ఫుల్ కాస్ట్) చార్జీల పెంపు కోసం టారిఫ్ ప్రతిపాదించవచ్చు. అదే జరిగితే ప్రభుత్వానికి మరింత ఇబ్బందికరంగా మారనుంది.
ఆదాయ లోటుపై అడ్డగోలు లెక్కలు
ఏపీ డిస్కంలు సగటున యూనిట్‌కు రూ.5.95 విద్యుత్ సరఫరా వ్యయం ప్రతిపాదించగా రాష్ట్ర డిస్కంలు ఏకంగా రూ.6.84కు పెంచి ప్రతిపాదించాయి. 54,756 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరముంటే, ఏకంగా 66,076 మిలియన్ యూనిట్ల లభ్యత ఉందని చూపాయి. సాగుకు ఉచిత సరఫరాను 6 గంటల నుంచి 9 గంటలకు పెంచడం, ఇందుకోసం అవసరానికి మించిన విద్యుత్ సమీకరించి పెట్టుకోవడం, విద్యుత్ సరఫరా వ్యయాన్ని భారీగా పెంచి చూపడంతో డిస్కంల ఆదాయ లోటు పెరిగిందని నిపుణులంటున్నారు.