విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలు!
నేడు ఈఆర్సీకి సమర్పించనున్న డిస్కంలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు గురువారం సమర్పించే అవకాశముంది. మూడుసార్లు గడువు పొడిగించినా డిస్కంలు టారిఫ్ పెంపు ప్రతిపాదనలు సమర్పించకపో వడంపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఈ నెల 17న అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 23లోగా 2017–18 ఆర్థిక ఏడాదికి సంబంధించిన టారిఫ్ ప్రతిపాద నలు సమర్పించకపోతే సుమోటోగా నిర్ణయం తీసుకుంటామని డిస్కంలకు ఈఆర్సీ లేఖ రాసింది. దీంతో గడువు ముగిసేలోపే విద్యు త్ చార్జీల పెంపు ప్రతిపాదనలు సమర్పించేం దుకు డిస్కంలు ప్రయత్నాలు చేస్తున్నాయి.
వచ్చే ఏడాది ఆదాయ లోటు రూ.9,824 కోట్లు ఉండనుందని, అందులో రూ.2 వేల కోట్లను చార్జీల పెంపు ద్వారా ప్రజల నుంచి రాబట్టుకోవాలని, మిగిలిన రూ.7,800 కోట్లను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించాలని నెల రోజుల కిందే డిస్కంలు సీఎం కేసీఆర్‌కు ప్రతిపాదిం చాయి. అయితే, ఇంతవరకు సీఎం ఆమోదం లభించ లేదు. గత వారం రోజులుగా చైనా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం రాత్రి హైదరాబాద్ రానున్నారు. ఆయన ఆధ్వర్యంలో సీఎంను కలసి చార్జీల పెంపు నకు అనుమతి కోరాలని డిస్కంల యాజ మాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.
సీఎంతో చర్చించిన తర్వాత ఆయన సలహాలు, సూచ నలు మేరకు మార్పు చేర్పులతో ఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలు సమర్పి స్తామని అధికార వర్గాలు తెలిపాయి. విద్యుత్ చట్టం నిబంధనల ప్రకారం గత నవంబర్‌లోగా సమర్పించాలని విద్యుత్ టారిఫ్ ప్రతిపాద నలను వివిధ కారణాలతో డిస్కంలు వాయిదా వేస్తూ వచ్చాయి. గడువు ముగిసిన తర్వాత కూడా ప్రతిపాదనలు సమర్పించని పక్షంలో ఈఆర్సీ సుమోటోగా టారీఫ్ ప్రతిపాద నలను ఖరారు చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించే అవకాశ ముంది.