ఐపీవోలో దూసుకెళ్లిన ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్
ఆటోమొబైల్ విడిభాగాల తయారీ సంస్థ ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ లిస్టింగ్ లో అదరగొట్టింది. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 25 శాతం అధిగమించి దూసుకుపోతోంది. రూ. 472 దగ్గర మొదలైన ఇష్యూ ప్రైస్ 21.19 శాం ప్రీమియాన్ని నమోదు చేసింది. రూ. 10 ముఖ విలువగల 2.64 కోట్లకు పైగా షేర్లను విక్రయించి మొత్తం రూ. 1,161 కోట్లను సమీకరించింది. ఈ ఐపీఓ ద్వారా రూ. 1161 కోట్ల నిధులలో యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ. 348 కోట్లు లభించాయి.
2000లో ఏర్పాటైన ఎండ్యూరెన్స్ ప్రధానంగా త్రిచక్ర, ద్విచక్ర వాహనాలకు ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ విడిభాగాలను తయారు చేస్తోంది. వీటితోపాటు పాసింజర్, తేలికపాటి వాణిజ్య వాహనాలకూ ప్రత్యేక విడిభాగాలను రూపొందిస్తోంది. ఆటో కాంపొనెంట్ విభాగానికి చెందిన కంపెనీ కావడం.. ప్రస్తుతం ఈ సెగ్మెంట్ కంపెనీల షేర్లలో ర్యాలీ జరుగుతూ ఉండడం కంపెనీకి కలిసి వచ్చిందని ఎనలిస్టుల అభిప్రాయం. మరోపక్క మంచి వర్షపాతం, 7వ వేతన సంఘం సిఫారసులు అమలు ద్విచక్రవాహనాల సెగ్మెంట్ లో డిమాండ్ ఊపందుకుందని తెలిపారు. ఔరంగాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఎండ్యూరెన్స్ కు దేశంలో 18 ప్లాంట్స్ ఉండగా, యూరోప్ లో 7 ప్లాంట్లుఉన్నాయి. అయితే ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్ లో 13.72శాతం వాటా ఉన్న యూకే కంపెనీ యాక్టిస్ ఎడ్వైజర్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఈ ఐపీవో తో బయటికి వచ్చినట్టు ప్రకటించింది.