
ఈక్విటీ ఫండ్స్ జోరు..
3 నెలల్లో 33కి పైగా ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆదాయపు పన్ను మినహాయింపుల్ని గతేడాది పెంచటం వల్ల సామాన్యుల జేబుల్లో డబ్బులు గలగలలాడుతున్నాయో ఏమో!! పొదుపు మొత్తాలు మాత్రం పెరుగుతున్నాయి. అందుకే దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి కొత్త పథకాలు దూసుకొస్తున్నాయి. ఏడాదిన్నర కాలంగా స్టాక్ సూచీలు ఆకర్షణీయమైన లాభాలను అందిస్తూ, సూచీలు నూతన గరిష్ట స్థాయిలను నమోదు చేస్తుండటంతో మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా గత మూడు నెలల కాలంలో 33కి పైగా ఈక్విటీ పథకాలు ఇన్వెస్టర్ల ముందుకు రావడమే కాకుండా, ప్రస్తుతం 12కు పైగా ఈక్విటీ పథకాల ఇష్యూలు నడుస్తున్నాయి.
దీంతో దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ కొత్త నిధుల ప్రవాహంతో కళకళలాడుతోంది. కేవలం ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోల ద్వారానే రూ.5,652 కోట్లు సమీకరించాయి. డెట్ పథకాలను కూడా కలుపుకుంటే ఈ మూడు నెలల కాలంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఎన్‌ఎఫ్‌వోల ద్వారా రూ.11,654 కోట్లు సమీకరించాయి. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఇప్పుడిప్పుడే ఆసక్తి పెరుగుతోందని, దీంతో కొత్త పథకాల విడుదలపై దృష్టి సారిస్తున్నామని ఫండ్ మేనేజర్లు చెబుతున్నారు. ఇది రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
క్లోజ్డ్ ఎండెడ్ పథకాలే ఎక్కువ...
మ్యూచువల్ ఫండ్ సంస్థలు క్లోజ్డ్ ఎండెడ్ పథకాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ఈ మూడు నెలల్లో ప్రవేశపెట్టిన 33 పథకాల్లో 26 పథకాలు క్లోజ్డ్ ఎండెడ్ కావటమే దీనికి నిదర్శనం. అలాగే ప్రస్తుతం నడుస్తున్న ఇష్యూల్లో 5 ఎన్‌ఎఫ్‌వోలు ఓపెన్ ఎండెడ్ అయితే, 8 క్లోజ్డ్ ఎండెడ్ పథకాలున్నాయి. దేశ ఆర్థిక వృద్ధిరేటును దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలంలో రాబడిని ఇచ్చే ఇండియా గ్రోత్ స్టోరీ, ఇండియా ఆపర్చునిటీస్ పేరుతో పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వీటి తర్వాతి స్థానంలో ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ర్యాలీలో ప్రధాన పాత్ర పోషిస్తున్న బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగానికి చెందిన ఫండ్స్ ఉన్నాయి.
ప్రధాన ఇండెక్స్ షేర్ల కంటే స్మాల్ క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు బాగా పెరుగుతుండటంతో ఫండ్స్ కూడా ఈ పథకాలపైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఏడాది కాలంలో సెన్సెక్స్ కేవలం 38 శాతం లాభాలను అందిస్తే ఇదే సమయంలో బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 75 శాతం లాభాలను అందించింది. కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలు అయితే గడిచిన ఏడాది కాలంలో 100 నుంచి 132 శాతం వరకు లాభాలను అందించడం విశేషం. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు.
భారీగా పెరిగిన ఫండ్ ఆస్తులు....
గడిచిన ఏడాది కాలంలో మ్యూచువల్ ఫండ్ ఆస్తుల విలువలో భారీ వృద్ధి నమోదయింది. గతేడాది ఫిబ్రవరిలో రూ.9.16 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఆస్తుల విలువ(ఏయూఎం), ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రూ.12.02 లక్షల కోట్లకు ఎగబకాయి. ప్రస్తుత 2014-15 ఆర్థిక సంవత్సరంలో నికరంగా ఇప్పటి వరకు రూ. 2.13 లక్షల కోట్ల నిధులు వచ్చినట్లు మ్యూచ్‌వల్ ఫండ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (యాంఫీ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
అంతకుముందు ఏడాది ఇదే కాలానికి ఫండ్స్‌లోకి నికరంగా రూ.1.63 లక్షల కోట్ల నిధులు వచ్చాయి. ఈక్విటీల్లోకి నిధుల ప్రవాహం పెరిగి డెట్, ఇతర ఫండ్స్ నుంచి నిధులు బయటకు వెళుతున్నట్లు ఈ గణాంకాలను చూస్తే అర్థమవుతోంది. మార్చి, 2014 నాటికి మొత్తం ఆస్తుల విలువలో ఈక్విటీ ఫండ్స్ వాటా 22 శాతంగా ఉంటే జనవరి నాటికి ఇది 30 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో డెట్ పథకాల వాటా 52 శాతం నుంచి 45 శాతానికి పడిపోయింది.