
ప్రతి కిటికీ.. ఓ ఎమర్జెన్సీ ఎగ్జిట్!
పాలెం వోల్వో బస్సు ఘటన గుర్తుందా? రెండేళ్ల క్రితం తెల్లవారుజామున బస్సు అకస్మాత్తుగా భస్మమైపోయి దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఒకటే ఉండటంతో మంటలబారి నుంచి ఎవరూ తప్పించుకోలేకపోయారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరక్కూడదన్న ఏకైక లక్ష్యంతో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు కె.జగదీశ్, ఆర్.భరత్, ఎస్.జీవన్, ఎంఎస్.కార్తీక్‌లు ఓ వినూత్న టెక్నాలజీని అభివృద్ధి చేశారు. బెంగళూరులోని గోపాలన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన వీరు ప్రమాద పరిస్థితుల్లో బస్సులోని అన్ని కిటికీలూ ఎమర్జెన్సీ ఎగ్జిట్లుగా మారిపోయేలా దీన్ని రూపొందించారు. డ్రైవర్ దగ్గర ఉండే ఓ బటన్‌ను నొక్కిన వెంటనే బస్సులోని అన్ని కిటికీలూ తెరుచుకునేలా ఏర్పాటు చేశారు. ఇందు కోసం కిటికీ అద్దాలను కొంత మార్చడంతోపాటు వాటిల్లో సెన్సర్లు ఏర్పాటు చేశారు. ఈ టెక్నాలజీని అమలు చేసేందుకు ఒక్కో బస్సుకు రూ.5 లక్షల వరకూ ఖర్చవుతుందని అంచనా!