మమతా బెనర్జీకి హిందీ టీచర్ కావాలట! | Eye on Delhi, Mamata Banerjee scouts for a Hindi teacher | Sakshi
Sakshi News home page

మమతా బెనర్జీకి హిందీ టీచర్ కావాలట!

Published Fri, Dec 2 2016 5:31 PM | Last Updated on Thu, Sep 27 2018 9:08 PM

మమతా బెనర్జీకి హిందీ టీచర్ కావాలట! - Sakshi

మమతా బెనర్జీకి హిందీ టీచర్ కావాలట!

న్యూఢిల్లీ: దేశంలో పెద్ద నోట్ల రద్దును తీవ్రంగా వ్యతిరేకించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో ఒక్కసారిగా దూసుకొచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పుడు ‘టాక్ ఆఫ్ ది కంట్రీ’ అయ్యారు. ఆమెను హత్య చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై నిన్న పార్లమెంట్ సమావేశాలు స్తంభించడం ద్వారా, తన అనుమతి లేకుండానే తన రాష్ట్రంలోకి సైన్యాన్ని ఎలా పంపిస్తారంటూ నేడు కేంద్రాన్ని నిలదీస్తూ సచివాలయం నుంచి కదలనంటూ మమత భీష్మించడం ద్వారా విస్త్రృత ప్రచారమే పొందారు.

కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహించాలనుకుంటున్న మమతా బెనర్జీ వీలైనప్పుడల్లా వచ్చిన మేరకు హిందీలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు హిందీలోనే ట్వీట్ చేస్తున్నారు. ఇప్పటికే బెంగాలి-హిందీ డి క్షనరీని కొనుక్కురని, హిందీ కవిత్వం కూడా చదువుతున్నారని వార్తలు వస్తుండగా, హిందీ బోధించే మంచి టీచరు కోసం ఆమె వెతుకుతున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే, ప్రధాన మంత్రి లాంటి ఉన్నత పదవులు వరించాలంటే హిందీ భాష రావడం ముఖ్యమనే అభిప్రాయం జాతీయ రాజకేయాల్లో ఎప్పటి నుంచో వేళ్లూనుకొని ఉంది.
 
యూపీ నుంచే తొలి ప్రధాని...
ఈ కారణం వల్లనే హిందీని మాతృభాషగా కలిగిన ఉత్తరప్రదేశ్‌కు జాతీయ రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పటి వరకు దేశానికి 14 మంది ప్రధాన మంత్రులు ప్రాతినిధ్యం వహించగా వారిలో 12 మంది ఉత్తరప్రదేశ్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. దేశ తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ యూపీకి చెందిన వారే (ఎప్పుడో కశ్మీరీ నుంచి వచ్చి స్థిరపడిన కుటుంబం వారిది). ఆయన హిందీలోనూ, ఇంగ్లీషులోనూ అనర్గళంగా మాట్లాడేవారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌కు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆరెస్సెస్ నేపథ్యం వల్ల ఆయనకు హిందీలో మాట్లాడడం బాగా వచ్చింది.
 
హిందీ భాష రాని ఏకైక ప్రధాని
ఇప్పటి వరకు ప్రధాన మంత్రులైన వారిలో హిందీ మాట్లాడడం రాని ఏకైక వ్యక్తి కర్నాటకకు చెందిన హెచ్‌డీ దేవెగౌడ. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో  ఏ పార్టీకి సరైన మెజారిటీ రాకపోవడంతో మూడవ ఫ్రంట్ తరఫున రాజీ అభ్యర్థిగా ప్రధాని పదవికి దేవెగౌడ ఎంపికయ్యారు. అప్పుడు కూడా ఆయన మొదటి ఛాయిస్ కాదు. వీపీ సింగ్, జ్యోతిబసులు నిరాకరించడంతో ఆయన్ని ఎంపిక చేసుకోవాల్సి వచ్చింది. అయితే 11 నెలల్లోనే దేవెగౌడ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన ప్రధాని హోదాలో ఎర్రకోట పైనుంచి స్వాతంత్య్ర దినోత్సవ సందేశాన్ని హిందీలో ఇవ్వాల్సి వచ్చినప్పుడు కన్నడంలో రాసుకొని చదివారు.
 
కామరాజు అందుకే ప్రధాని కాలేకపోయారు...
1954 నుంచి 1963 వరకు తమిళనాడుకు ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామి కామరాజు, తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1964లో చనిపోయే నాటికి కేంద్ర కాంగ్రెస్‌లో చాలా బలమైన నాయకుడు. అప్పడు ప్రధాని రేసులోవున్న మురార్జీ దేశాయ్, బాబూ జగ్జీవన్‌రామ్‌లను అడ్డుకొని లాల్ బహదూర్ శాస్త్రీని నెహ్రూ వారుసుడిని చేసిందీ కామరాజే. రెండేళ్లలో శాస్త్రీ కూడా మరణించడంతో ఆయన స్థానంలో ఇందిరాగాంధీని ఎంపిక చేయడంలో కూడా కామరాజు కీలక పాత్ర పోషించారు. వెనకబడిన కులానికి చెందిన కామరాజు పార్టీలో ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ ఎందుకు ప్రధాన మంత్రి పదవిని ఆశించరని మీడియా ప్రశ్నించగా, ‘నో హిందీ, నో ఇంగ్లీష్’ అని సమాధానం ఇచ్చారు. ప్రధాని కావాలంటే ఈ రెండు భాషలు రావడం తప్పనిసరి అని చెప్పారు. హిందీ భాష ప్రాబల్యానికి వ్యతిరేకంగా 1960లో తమిళనాడులో పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చెలరేగాయి.
 
ప్రణబ్ ముఖర్జీకి కూడా హిందీ రాకపోవడమేనట...
1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైనప్పుడు ఆమె స్థానంలో ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రధాని అవుతారని ఊహాగానాలు వెలువడ్డాయి. ‘నీకు సరైన హిందీ రాకపోతే నీవు ప్రధాన మంత్రివి కాలేవు. కొన్ని పదవులకు కొన్ని నైపుణ్యాలు అవసరం’ అంటూ ప్రణబ్ ఆ ఊహాగానాలకు తెరదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement