సూపర్ ఎమర్జెన్సీ.. కరెక్టే: తేజస్వి
పట్నా: పెద్దనోట్ల రద్దుతో దేశంలో సూపర్ ఎమర్జెన్సీ విధించినట్టుగా ఉందన్న బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ వ్యాఖ్యలను బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ సమర్థించారు. 'నోట్ల రద్దు తర్వాత దేశమంతటా పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. ప్రధాని మోదీ హామీ ఇచ్చినప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలకు అడ్డుకట్ట పడటం లేదు. అణగారిన వర్గాల పరిస్థితి, మారుమూల గ్రామాల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది.
వారికి ఏటీఎంలు కానీ, ఆధునిక టెక్నాలజీ కానీ అందుబాటులో లేదు. నోట్ల రద్దు వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ప్రధాని ప్రజల కష్టాల గురించి మాట్లాడటం లేదు. ఈ పరిస్థితి సూపర్ ఎమర్జెన్సీని తలపిస్తున్నదని మమత పేర్కొన్న వ్యాఖ్యలు సరైనవేనని నాకు అనిపిస్తోంది' అని తేజస్వి బుధవారం విలేకరులతో అన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో మోదీ సర్కార్ పై తీవ్రంగా ధ్వజమెత్తుతూ.. దేశంలో ఎమర్జెన్సీ, సూపర్ ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని మమతా బెనర్జీ మంగళవారం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.