నితీష్ కుమార్ ఓటెవరికి?
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిగా జాతిపిత మహాత్మాగాంధీ మనుమడు గోపాలకృష్ణ గాంధీని ఎంపిక చేయడంలో విజయం సాధించిన ప్రతిపక్షాలు జేడీయూ నాయకుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మద్దతును కూడగట్టడంలో విజయం సాధిస్తాయా? అన్నదే ఇప్పుడు ముఖ్యమైన అంశం. ప్రతిపక్షాల ఐక్యతకు గత ఏప్రిల్ నెలలోనే అన్నీ తానై చొరవ తీసుకున్న నితీష్ కుమార్ తమతో చేతులు కలుపుతారనే ఆశ ప్రతిపక్షాలకు లేకపోలేదు.
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలోనే నితీష్ కుమార్ కలసివస్తారని కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్ష పార్టీలు ఆశించాయి. ఆయన అనూహ్యంగా ప్రతిపక్షాల సమావేశానికి హాజరుకాకపోవడం, అదేరోజు ప్రధాని నరేంద్ర మోదీతో విందు సమావేశంలో పాల్గొనడం విపక్ష పార్టీలను విభ్రమపర్చాయి. అనుమానించినట్లుగానే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నోథ్ కోవింద్‌ను బలపర్చి ప్రతిపక్ష పార్టీలను నితీష్ కుమార్ నిరాశ పర్చారు.
అలాగే రాష్ట్రపతి పదవికి ఉమ్మడి అభ్యర్థిని ఎన్నుకోవడం కోసం మంగళవారం జరిగిన విపక్షాల సమావేశానికి నితీష్ కుమార్ ఎగనామంపెట్టి ఇప్పుడు కూడా అనుమానం బీజాలు నాటారు. బీజేపీలో ఉన్నప్పుడు కూడా లౌకికభావాలు కట్టుబడి రాజకీయవేత్తగా రాణించిన నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ప్రధాని మోదీ పక్షాన చేరాల్సిన అవసరమే లేదు. లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు జరిపితే దాన్ని ఇబ్బందికర పరిణామంగా భావించి లాలూతో నితీష్ తెగతెంపులు చేసుకుంటారని బీజేపీ పెద్ద నేతలు ఆశించి ఉండవచ్చు. దర్యాప్తు దశలో లాలూతో సంబంధాలు తెంపుకోవాల్సిన అవసరం నితీష్‌కు లేదు. ఎందుకంటే అంతకంటే అపకీర్తి కలిగిన నేతల మద్దతుతో నితీష్ ప్రభుత్వ పాలన సాగించిన రోజులు ఉన్నాయి. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌గా ముద్రపడిన సూరజ్ భాన్ సింగ్ లాంటి వారి మద్దతుతోనే ఆయన ప్రభుత్వాని నిలబెట్టుకున్నారు.
1989లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పాటవడానికి ముఖ్యకారకుడు నాటి హర్యానా ముఖ్యమంత్రి దేవీలాల్. ఆయనే అన్ని విపక్షాలను ఏకం చేశారు. సరిగ్గా ఇప్పుడు అలాంటి మహత్తర పాత్రను నిర్వహించే అవకాశం నితీష్ కుమార్‌కు వచ్చింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదిగే అవకాశం కూడా ఉంది. ఈ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుంటారా? 1966లో జ్యోతిబసు ప్రధాన మంత్రయ్యే అవకాశాన్ని వదులుకొని చారిత్రక తప్పిదం చేశామంటూ పశ్చాత్తామం పడతారా? అన్నది నితీష్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.