ఆఫ్ లైన్ లోనూ ఫేస్ బుక్ వీడియోలు!
యూట్యూబ్ తో పోటీని ఉధృతం చేయడానికి ఫేస్ బుక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆఫ్ లైన్ లో కూడా భారత యూజర్లు వీడియోలు వీక్షించేలా అవకాశం కల్పించనున్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది. జూలై 11 నుంచి భారత్ లో ఈ టెస్టింగ్ ను ప్రారంభించబోతున్నట్టు వెల్లడించింది. ఈ ఫీచర్ ను మొదట తక్కువ మంది యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చి అనంతరం ఫేస్ బుక్ వినియోగదారులందరికీ ఈ అవకాశం కల్పించాలని ఫేస్ బుక్ యోచిస్తోంది. భారత్ లో ఎంపిక చేసిన మీడియా పార్టనర్లకు ఫేస్ బుక్ తన ప్లాన్ గురించి తెలుపుతూ ఈ-మెయిల్స్ పంపింది. దీంతో ఫేస్ బుక్ అందించబోయే ఆఫ్ లైన్ వీడియోలు ప్రస్తుతం మీడియా హౌజ్ లకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.
ఫేస్ బుక్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో ఉన్నప్పుడు యూజర్లు వీడియోలను డౌన్ లోడ్ చేసుకుని, ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఆ వీడియోలను వీక్షించేలా ఈ కొత్త ఆప్షన్ ను ఫేస్ బుక్ ప్రవేశపెట్టనుంది. పబ్లిషర్లు తమ అప్ లోడెడ్ వీడియోలు, డౌన్ లోడ్ కు అవకాశం కల్పించొద్దు అనుకుంటే ఆ స్వేచ్చను కూడా పబ్లిషర్లకు ఫేస్ బుక్ కల్పించనుంది. యూట్యూబ్ 2014లోనే ఆఫ్ లైన్ వీడియో సేవలను భారత్ లో ప్రారంభించింది.
డౌన్ లోడ్ చేసుకున్న 48 గంటల అనంతరం నుంచి యూజర్లు ఆ వీడియోలను ఆఫ్ లైన్ లో చూడొచ్చు. అయితే ఈ విషయంలో ఫేస్ బుక్ ఎలాంటి పరిమితులను విధించలేదు. వీడియో స్ట్రీమింగ్ సర్వీసుతో ఫేస్ బుక్ కు క్రేజ్ పెరుగుతోంది. కొత్త ఫీచర్లు, సర్వీసులతో ఫేస్ బుక్ లైవ్ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను విస్తరిస్తూ వస్తోంది. యూజర్లు తన యాప్, వెబ్ సైట్ ద్వారా 1000 లక్షల గంటలు వీడియోలు చూస్తున్నారని ఫేస్ బుక్ రికార్డుల్లో ఇటీవలే తేలింది.