
తెలుగు వ్యవసాయ శాస్త్రవేత్తకు కొరియా పురస్కారం
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా(76) దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత సున్హక్ శాంతి పురస్కారం అందుకోనున్నారు.
సియోల్: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా(76) దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత సున్హక్ శాంతి పురస్కారం అందుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన విజయ్ గుప్తాకు.. ఈ పురస్కారాన్ని కిరిబతి ఐలాండ్స్ అధ్యక్షుడు అనొటె టాంగ్‌తో కలిసి సంయుక్తంగా ప్రకటించారు. సియోల్‌లో నేడు(శుక్రవారం)జరిగే ప్రదానోత్సవ కార్యక్రమం లో ఈఅవార్డు కింద వారిరువురికి రూ.3.3కోట్ల చొప్పున నగదు పురస్కారం, జ్ఞాపిక అందజేస్తారు.
మంచినీటి చేపలపెంపకంలో చవక విధానాలను అభివృద్ధి చేసినందుకు విజయ్ గుప్తాకు 2005లో వరల్డ్‌ఫుడ్ ప్రైజ్ లభించింది. గతంలో ఆయన మలేసియాలోని పెనంగ్‌లోని అంతర్జాతీయ మత్స్య పరిశోధన సంస్థ ‘వరల్డ్ ఫిష్’కు అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్‌గా పనిచేశారు. భూ తాపోన్నతి వల్ల సముద్రమట్టం పెరిగి అందులో మునిగిపోయే ప్రమాదం నుంచి తమ లాంటి చిన్న ద్వీప దేశాలను కాపాడే లక్ష్యంతో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు కిరిబతి ఐలాండ్స్ అధ్యక్షుడు అనొటెటాంగ్ అలుపెరగని పోరాడుతున్నారు. ప్రపంచశాం తి, అభివృద్ధి కోసం కృషి చేసిన వారికి దక్షిణ కొరియాకు చెందిన ఆధ్యాత్మిక నేత డాక్టర్ హక్ జా హన్ మూన్ ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు.