
ఫిడెల్ క్యాస్ట్రో 90వ బర్త్ డే: అదిరిపోయే కానుక
హవాన: క్యూబా మాజీ అధ్యక్షుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ క్యూబా దిగ్గజం ఫిడెల్ క్యాస్ట్రో 90వ పడిలోకి ప్రవేశించారు. ఓరియెంట్ ఫ్రావిన్స్ లోని బిరాన్ అనే ఊరిలో 1926, ఆగస్టు 13న జన్మించారాయన. తల్లిదండ్రుల పేర్లు గలీసియా, ఏంజెల్ క్యాస్ట్రో అర్జీజ్. ఫిడెల్ పూర్తి పేరు ఫిడెల్ అలెజాండ్రో క్యాస్ట్రో. మార్క్సిస్టు- లెనినిస్టు భావాలకుతోడు క్యూబన్ జాతీయతను కలగలపి ఫిడెల్ స్థాపించిన క్యూబా కమ్యూనిస్ట్ పార్టీ.. నాటి అమెరికా అనుకూల బటిస్టా ప్రభుత్వాన్ని విప్లవోద్యమం ద్వారా కూల్చివేసి, దేశాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఎన్నో ప్రత్యేక లక్షణాలు సంతరించుకున్న ఫిడెల్ కు.. పనామా సిగార్ లతో అదోరకం అనుబంధం. ముఖ్య స్నేహితుడు, అర్జెంటీనియన్ అయిన చెగువేరాతో కలిసి ఫిడెల్ పనామా సిగార్ కాల్చుతున్న ఫొటోలు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి. ఫిడెల్ 90వ పుట్టినరోజు సందర్భంగా హవానాకు చెందిన ఓ సీనియర్ చుట్టల(సిగార్ల) తయారీదారుడు తన అభిమాన నేత కోసం అదిరిపోయే కానుక సిద్ధం చేశాడు. క్యాస్ట్రో కోసం 90 మీటర్ల పొడవున్న సిగార్ ను సిద్ధం చేశాడు. ప్రపంచంలో అతి పొడవైన సిగార్ కూడా ఇదే కావడం మరో విశేషం.