
అన్యాయం కాదు... న్యాయమూ కాదు! : సుదర్శన్ రెడ్డి
తంలో ఇచ్చిన తీర్పులో సవరణలకు ఎంతవరకు ఆస్కారం ఉంటుందనేది చూసి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుదితీర్పును ఇచ్చిందని, మిగతాది సుప్రీంకోర్టులో తేలుతుందని రాష్ట్రం తరఫున ట్రిబ్యునల్ ఎదుట వాదించిన సీనియర్ న్యాయవాది డి.సుదర్శన్‌రెడ్డి చెప్పారు.
మిగతాది సుప్రీంలో తేలుతుంది... మరో ఎస్‌ఎల్‌పీ వేయాల్సి ఉంటుంది
బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పుపై రాష్ట్రం తరపు న్యాయవాది సుదర్శన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: గతంలో ఇచ్చిన తీర్పులో సవరణలకు ఎంతవరకు ఆస్కా రం ఉంటుందనేది చూసి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుదితీర్పును ఇచ్చిందని, మిగతాది సుప్రీంకోర్టులో తేలుతుందని రాష్ట్రం తరఫున ట్రిబ్యునల్ ఎదుట వాదించిన సీనియర్ న్యాయవాది డి.సుదర్శన్‌రెడ్డి చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్ తుది తీర్పు ప్రకటించాక ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆల్మట్టి డ్యాం అనుమతుల విషయాన్ని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) చూస్తుందని, ఈ విషయమై రాష్ట్రం ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని, అందులోని అంశాలన్నింటిపైనా అక్కడ వాదనలు జరుగుతాయని స్పష్టంచేశారు. ‘‘ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు తదితర అంశాలపై మనం స్పెషల్ లీవ్ పిటిషన్‌లో పలు ప్రశ్నలు లేవనెత్తాం. అది పెండింగ్‌లో ఉంది. ఇప్పుడొచ్చిన తీర్పును పరిశీలించి మనం లాంఛనంగా మరో ఎస్‌ఎల్‌పీ వేయాల్సి ఉంటుంది. తుదితీర్పుపై ట్రిబ్యునల్ ఇక సమీక్ష చేయడమంటూ ఉండదు’’ అని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందా, ఊరట లభించిందా? అన్న ప్రశ్నకు.. ‘‘అన్యాయం జరిగిందని చెప్పడానికి లేదు, జరగలేదని చెప్పడానికి లేదు’’ అని బదులిచ్చారు.
తీర్పును పూర్తిగా చూసేవరకు వివరాలు తెలియవని, అయితే ఆర్‌డీఎస్ కుడికాలువకు 4 టీఎంసీలివ్వడం మంచి విషయమన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితెలా ఉంటుందన్న ప్రశ్నకు.. ‘‘మిగులు జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టులకు నీళ్ల విషయానికొస్తే హక్కనేది ఎప్పటికీ రాదు. మిగులు జలాలపై గతంలో స్వేచ్ఛ ఉంది. ఇప్పుడూ స్వేచ్ఛ ఉంది. తెలుగుగంగకు 25 టీఎంసీలిచ్చారు. ఆ కేటాయింపులు అలాగే ఉన్నాయి. మనకు 150 టీఎంసీలు క్యారీఓవర్ ఇచ్చారు. వాటిని మనం ప్రాజెక్టులకు వాడుకోవచ్చు. విభజన తర్వాత ఏమిటనేది జీవోఎం లేదా మరేదైనా కమిటీ చేస్తుంది. విభజన తర్వాత కిందిరాష్ట్రానికి మిగులు జలాలపై హక్కు గురించి ఇక్కడ మాట్లాడటం సరికాదు’’ అని ఆయన బదులిచ్చారు. ట్రిబ్యునల్ ఎదుట వాదనలు సరిగా వినిపించలేదన్న విమర్శలను ప్రస్తావించగా.. విమర్శలనేవి ఎవరైనా చేయవచ్చని, సరిగా వాదించాం కనుకే ఈ పరిస్థితిలో ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.