సుప్రీం తీర్పును ఉల్లంఘించిన మాయావతి
లక్నో/గోండా: కులమతాల పేరుతో ఓట్లు కోరడం చట్టవిరుద్ధమన్న సుప్రీం కోర్టు తీర్పును బీఎస్పీ చీఫ్ మాయావతి ఉల్లంఘించారు. ముస్లింలు ఎస్పీకి కాకుండా తమ పార్టీకి ఓటేయాలని మంగళవారం ఎన్నికల సభల్లో కోరారు. ‘మీరు ఎస్పీకి ఓటేస్తే అది వ్యర్థం కావడమే కాకుండా పరోక్షంగా బీజేపీకి లబ్ధి చేకూర్చే అవకాశముంది’ అని అన్నారు.
యూపీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ, ప్రధాని మోదీ కులమతాల రంగు పులిమారని ఆమె ఓ ప్రకటనలో ఆరోపించారు. ప్రతి గ్రామంలో ఖబరస్తాన్, శ్మశానం ఉండాలన్న మోదీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ ఏర్పాటు చేసి, తర్వాత యూపీ గురించి మాట్లాడాలని అన్నారు.