
పెట్టుబడులకు విదేశీ కంపెనీల ఆసక్తి
♦ మంత్రి జూపల్లితో ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం భేటీ
♦ నీళ్ల బాటిళ్ల తయారీ పరిశ్రమపై మలేసియా సంస్థ ఆసక్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వివిధ రంగా ల్లో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తితో ఉన్నట్లు ఆస్ట్రేలియా దక్షిణ భారత కాన్సుల్ జనరల్ సీన్ కెల్లీ చెప్పారు. కెల్లీ నేతృత్వంలోని ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో బుధవారం సచివాలయంలో భేటీ అయింది. రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని ప్రశంసించిన ఆ బృందం తెలంగాణలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఎన్‌ఎస్‌ఎల్ మైనింగ్ కంపెనీ ఆసక్తితో ఉన్నట్లు తెలిపింది. తక్కువ నాణ్యతున్న ముడి ఖనిజం నాణ్యత మరింత పెంచే సాంకేతికత ఎన్‌ఎస్‌ఎల్‌కి ఉందన్నారు.
వృత్తివిద్య, మైనింగ్, పర్యావరణం, మౌలిక సౌకర్యాలు, రోడ్డు భద్రత, రవాణా, సాంకేతికత, బయో టెక్నాలజీ తదిత ర రంగాల్లో ఇప్పటికే పలు ఆస్ట్రేలియన్ కంపెనీలు హైదరాబాద్ సంస్థలతో కలిసి పనిచేస్తు న్న విషయాన్ని కెల్లీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రా లు ప్రారంభించేందుకు ఆ దేశ రిటైల్ కాలేజీ ఆసక్తితో ఉందన్నారు. హైదరాబాద్ ఫార్మాసిటీ అభివృద్ధికి సహకరిస్తామన్నారు. చక్కెర పరిశ్రమ లో ప్రపంచంలోనే అత్యుత్తమ స్థాయిలో ఉన్న తమ దేశం స్థానికంగా మెరుగైన ఉత్పత్తి సాధ నకు, సాంకేతికత పంచుకునేందుకు సిద్ధంగా ఉందనీ కెల్లీ చెప్పారు.
కొత్త పారిశ్రామిక విధా నాన్ని ఆస్ట్రేలియన్ బృందానికి మంత్రి జూపల్లి వివరించారు. స్థానికంగా పెట్టుబడులకు అనువైన వాతావరణం, నైపుణ్యము న్న మానవ వనరులు ఉన్నాయన్నారు. వైస్ కాన్సుల్ నటాషా మోరిస్, దక్షిణాసియా ప్రాం తీయ డైరక్టర్ పీటర్ బాల్డ్‌విన్, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ ఈడీ రే నికో బృందంలో ఉన్నారు.
మలేసియా కంపెనీ ఆసక్తి: బాటిల్డ్ వాటర్ తయారీలో ప్రసిద్ధ మలేసియన్ కంపెనీ స్ప్రిజర్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి కనబరి చింది. సంస్థ ప్రతినిధులు కెన్నీ లిమ్ సెంగ్‌సీ, జోఆన్‌చాంగ్ నేతృత్వంలోని బృందం బుధవారం జూపల్లిని కలిసింది. తెలంగాణలో తమ కంపెనీ ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాన్ని గుర్తించాల్సి ఉందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.