'ఏమాత్రం డౌట్ వచ్చినా.. చంపించేవాడు'
ముంబై: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ స్వార్థపరుడు, పచ్చి అవకాశవాదని మాజీ అనుచరులు చెబుతున్నారు. ఛోటా రాజన్ తన గ్యాంగ్ సభ్యులను అనుమానించేవాడని, వారిపై ఏమాత్రం సందేహం వచ్చినా చంపాలని ఆదేశించేవాడని చెప్పారు. ఇండోనేసియా పోలీసులు ఛోటా రాజన్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో భారత్కు తీసుకురానున్నారు. ఒకప్పుడు మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో కలసి పనిచేసిన ఛోటా రాజన్ 1990లో అతనితో విభేదాలు వచ్చి విడిపో్యాడు. ఆ తర్వాత సొంతంగా గ్యాంగ్ నడిపేవాడు.
ఛోటా రాజన్ తన వద్ద పనిచేసిన ఓపీ సింగ్, మోహన్ కొటియన్, బాలా కొటియన్, భరత్ నేపాలి, శామ్యూల్ అలియాస్ శామ్ను చంపించినట్టు సమాచారం. ఓపీ సింగ్ను నాసిక్ జైల్లో చంపారు. తన స్థానంలో నాయకుడిగా ఎదిగేందుకు ఓపీ సింగ్ ప్రయత్నిస్తున్నాడనే అనుమానంతో ఛోటా రాజన్ అతన్ని హత్య చేయించాడు. జర్నలిస్ట్ జే డేను కూడా రాజన్ ఇలాగే చంపించినట్టు అండర్ వరల్డ్ కథనం. తనకు సంబంధించిన సమాచారాన్ని ఛోటా షకీల్కు చేరవేస్తున్నాడని అనుమానంతో డేను చంపించాడని తెలిపారు. 'రాజన్కు ఏ మాత్రం తెలివిలేదు. గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటాడు. ఎవరైనా ఇతరుల గురించి చెడుగా చెబితే అది నిజామా కాదా అని తెలుసుకునేవాడు కాదు. ఇప్పుడు రాజన్కు మిత్రుల కంటే శత్రువులే ఎక్కువయ్యారు' అని అండర్ వరల్డ్ వర్గాలు వెల్లడించాయి. రాజన్ శత్రువుల జాబితాలో ఛోటా షకీల్తో పాటు గ్యాంగ్స్టర్లు విజయ్ శెట్టి, రవి పూజారి, హేమంత్ పూజారి ఉన్నారు.