న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం భౌతికకాయం కాసేపట్లో ఢిల్లీ చేరుకోనుంది. పాలెం విమానాశ్రయానికి కలాం పార్ధీవ దేహాన్ని తీసుకురానున్నారు. ఇందుకోసం పాలెం విమానాశ్రయంలో ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్, రక్షణమంత్రి మనోహర్ పారీకర్ తదితరులు పాలం విమానాశ్రయానికి వెళ్లనున్నారు.
పాలం విమానాశ్రయం నుంచి టెన్ రాజాజీ మార్గ్‌లోని అధికారిక నివాసానికి కలాం భౌతికకాయాన్ని తరలించనున్నారు. మరోవైపు కలాంకు ప్రజలు ఆయన నివాసంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి నివాళులు అర్పించవచ్చని రక్షణ శాఖ అధికారి ఒకరు ట్విట్ చేశారు.
కాగా మంగళవారం ఉదయం ఐదున్నర గంటలకు వైమానిక దళ హెలికాప్టర్‌లో కలాం పార్థివదేహాన్ని గువాహటి వరకు.... అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకువచ్చారు. మరోవైపు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు గౌరవ సూచకంగా దేశవ్యాప్తంగా.... ఏడు రోజుల పాటు జులై 27 నుంచి ఆగస్ట్ 2 వరకు జాతీయ సంతాప దినాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ వారం రోజులు జాతీయ పతాకాన్ని సగం వరకు అవనతం చేస్తారు. మరోవైపు కేంద్ర మంత్రివర్గం సమావేశంలో కలాం అంత్యక్రియలపై నిర్ణయం తీసుకోనున్నారు.