సాక్షి, హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇటీవల మృతి చెందిన నారాయణ్‌ఖేడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డిలకు శాసనసభ, శాసనమండలి నివాళులు అర్పించాయి. అసెంబ్లీ, మండలి వర్షాకాల సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు రెండు సభలు ప్రారంభంకాగానే సంతాప తీర్మానాలను ప్రవేశపెట్టారు. పలువురు సభ్యులు మాట్లాడిన అనంతరం ఈ తీర్మానాలను ఆమోదించిన అసెంబ్లీ, మండలి 29వ తేదీకి వాయిదాపడ్డాయి.
శాసనసభలో ఉదయం సభ ప్రారంభం కాగానే కలాం మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కలాం సేవలను కేసీఆర్ కొనియాడారు. ‘‘నిరుపేద కుటుంబం నుంచి వచ్చి రాష్ట్రపతి పదవిని అధిరోహించిన మేధావి కలాం. నిరంతరం దేశ ప్రయోజనాల కోసం పనిచేశారు. హైదరాబాద్‌తో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది. డీఆర్‌డీఎల్‌కు కలాం పేరు పెట్టాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్రానికి సూచించాను.
ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తునా..’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ భద్రతకు కలాం చేసిన సేవలు ఎనలేనివని కాంగ్రెస్ పక్ష నేత జానారెడ్డి అన్నారు. ఆయన జీవితం నుంచి అందరూ స్ఫూర్తి పొందాలన్నారు. కలాం స్ఫూర్తితో తెలంగాణను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. కలాం మరణం యావత్‌జాతికి తీరని లోటని బీజేఎల్పీ నేత లక్ష్మణ్ అన్నారు.
మహోన్నత వ్యక్తిత్వంతో అందరినీ కదిలించిన కలాం పేరును డీఆర్‌డీఎల్‌కు మాత్రమే పరిమితం చేయకుండా మెట్రోరైలుకు కూడా పెట్టి హైదరాబాద్‌తో ఉన్న అనుబంధాన్ని శాశ్వతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష నేత పాయం వెంకటేశ్వర్లు సూచించారు. ఏదైనా యూనివర్సిటీకి కలాం పేరు పెట్టాలని సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్ కోరారు. మంత్రి ఈటల, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ సభ్యులు రసమయి బాలకిషన్, శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ సభ్యులు మల్లు భట్టివిక్రమార్క, సంపత్‌కుమార్, రాజేందర్‌రెడ్డి (టీడీపీ), కిషన్‌రెడ్డి (బీజేపీ), పాషాఖాద్రి (మజ్లిస్), సున్నం రాజయ్య (సీపీఎం) తదితరులు కలాం సేవలను కొనియాడారు.
కలాం మృతిపట్ల శాసనమండలిలో సంతాప తీర్మానాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టారు. విద్యార్థులు, యువతకు, అన్ని రంగాల వారికి కలాం స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయారని పేర్కొన్నారు. పీఎస్‌ఎల్‌వీ రూపకల్పనలో, పృథ్వీ, అగ్ని క్షిపణులు, పోఖ్రాన్ అణుపరీక్షల నిర్వహణలో కలాం కీలకపాత్రను పోషించారని మండలి చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. హైదరాబాద్ ఎంతో అనుబంధమున్న కలాం పేరును ఏదైనా కొత్తగా స్థాపించే ఐఐటీ, ఐఐఐటీ వంటి సంస్థకు పెట్టాలని విపక్షనేత షబ్బీర్‌అలీ సూచించారు. భారతజాతికి గొప్ప అదృష్టంగా కలామ్ లభించారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సయ్యద్ అమీన్ జాఫ్రీ (ఎంఐఎం), రామచంద్రరావు (బీజేపీ), పొంగులేటి సుధాకర్‌రెడ్డి (కాంగ్రెస్) తదితరులు కలాం సేవలను కొనియాడారు.
కలాం, కిష్టారెడ్డిలకు నివాళి
Published Thu, Sep 24 2015 1:23 AM | Last Updated on Tue, Oct 30 2018 7:45 PM
Advertisement