
మాజీ ప్రధాని ర్యాలీలో అపశృతి
ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీకొని 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనం ఢీకొని 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
తన కుటుంబసభ్యులకు విదేశాల్లో అక్రమాస్తులు ఉన్నాయంటూ పనామా పేపర్‌లో ఆరోపణలు రావడంతో సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గద్దెదిగిన షరీఫ్ తిరిగి అధికారం దక్కించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రజల మద్ధతు కూడగట్టేందుకు దేశవ్యాప్తంగా బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం గుజ్రాత్ లో బహిరంగ సభకు హాజరయ్యేందుకు మద్ధతుదారులతో లాహోర్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. లాలామూస వద్దకు రాగానే డివైడర్ దాటుతున్న బాలుడిని కాన్వాయ్ లోని ఓ కారు ఢీకొట్టగ్గా, అక్కడికక్కడే చనిపోయాడు.
ఘటనపై స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. పాక్ ప్రజాస్వామిక పోరాటంలో అసువులు బాసిన తొలి అమరవీరుడు ఆ బాలుడేనని రైల్వే మంత్రి ఖవాజా పేర్కొనగా, బాలుడి కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి అన్ని విధాల ఆదుకుంటానని షరీఫ్ గుజ్రాత్ సభలో ప్రకటించారు.