న్యూయార్క్: అంగారక గ్రహం అవతరనకు దారితీసిన పరిస్థితులు అర్థం చేసుకోవడం అంత ఈజీకాదని తెలుస్తోంది. అంగారక గ్రహంపైకి పరిశోధనల కోసం పంపించిన క్యూరియాసిటీ రోవర్, అంగారకుడి ఉపరితలంపై ట్రిడిమైట్ అనే ఖనిజాన్ని కనుక్కోవడం శాస్త్రవేత్తలకు కొత్త చిక్కులు తెచ్చింది. ఇంతకుముందు శాస్త్రవేత్తలు ఊహించినదానికన్నా అంగారక గ్రహం అధిక ఉష్ణోగ్రతతో కూడిన అగ్ని పర్వతాల నిలయంగా ఉండి ఉంటుందని, అందుకనే అక్కడ ట్రిడిమైట్ ఖనిజం ఏర్పడి ఉంటుందన్నది శాస్త్రవేత్తల నవీన భావం. ఎందుకంటే భూ అంతర్భాగంలో సిలికా ఖనిజాలు మండిపోవడంతో వల్ల ఉద్భవించిన శిలా ద్రవాలు నీటితో కలసి భూ ఉపరితలానికి లావా రూపంగా ప్రవహించడం వల్ల ట్రిడిమైట్ అనే ఖనిజం ఏర్పడుతోంది.
ఇదే నిజమైతే అంగారకుడి గ్రహంపై నీటి నిల్వలు కచ్చితంగా ఉండాలి. అలాంటి నీటి నిలువల జాడలకు కూడా ఇప్పటి వరకు నాసా శాస్త్రవేత్తలు కనుగొనలేక పోయారు. పైగా ఇంతకుముందు ఊహించిన దానికన్నా అంగారకుడిపై ఎక్కువ ఉష్ణాగ్రత ఉన్నట్లయితే నీటి నిల్వలు కూడా ఉండే అవకాశం లేదు. ఈ కారణంగా ట్రిడిమైట్ ఖనిజం సిలికా శిలాజ ద్రవం, నీరు కలిస్తే ఏర్పడుతుందన్న నిర్వచనం అన్న తప్పుకావాలి. లేదా ఇంతకాలం అంగారక గ్రహాన్ని మనం అర్థం చేసుకున్న తీరైన తప్పుకావాలని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్ శాస్త్రవేత్తలు తర్జనభర్జన పడుతున్నారు.
‘అగ్ని పర్వతాల్లో తీవ్ర విస్ఫోటనం (సిలిసిక్ వాల్కనిజం) సంభవించడం వల్ల ట్రిడ్‌మైట్ ఖనిజం ఏర్పడుతుందని ఇంతకాలం భావిస్తూ వచ్చాం. అంతటి ఉష్ణోగ్రతగాని, తీవ్ర అగ్ని పర్వతాలుగానీ అంగారకుడిపై లేవని అభిప్రాయంతోనే ఇంతకాలం ఉన్నాం. దీన్నిబట్టి చూస్తే చల్లటి వాతావరణంలో కూడా ట్రిడ్‌మైట్ ఖనిజం ఏర్పడే అవకాశం ఉండవచ్చు. ఆ దిశగా మరిన్ని పరిశోధనలు కొనసాగాల్సి ఉంది’ అని నాసా ప్లానేటరి శాస్త్రవేత్త రిచర్డ్ మోరిస్ వ్యాఖ్యానించారు. అంగారక గ్రహంపైకి జీవిని పంపించాలని అభివృద్ధి చెందిన దేశాలు ఆశిస్తున్న తరుణంలో అంగారక గ్రహం మిస్టరీని వీలైనంత త్వరగా ఛేదించాల్సిన అవసరం ఉంది.
అంగారక గ్రహంపై అంతుచిక్కని మిస్టరీ?
Published Sat, Jul 23 2016 5:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM
Advertisement
Advertisement