‘నిర్భయ’ దోషులకు మరో కేసులో పదేళ్ల శిక్షa
న్యూఢిల్లీ: 2012 నాటి ఢిల్లీ గ్యాంగ్(నిర్భయ కేసు) రేప్ దోషులు నలుగురికి మరో కేసులో ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు పదేళ్ల కఠిన జైలు శిక్ష విధించింది. అక్షయ్ కుమార్ సింగ్, ముకేశ్, పవన్‌గుప్తా, వినయ్ శర్మ అనే ఆ దోషులకు ఇప్పటికే గ్యాంగ్ రేప్, హత్య నేరాలకుగాను ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. వారు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన 2012 డిసెంబర్ 16నే, ఆ దుశ్చర్యకు ముందు, రామ్ అధర్ అనే కార్పెంటర్‌ను బస్సులో ఎక్కించుకుని అతని వద్దనున్న మొబైల్ ఫోన్, రూ. 1500ను లాక్కొన్న కేసులో ఒక్కొక్కరికి పదేళ్ల శిక్ష, రూ. 1.01 లక్షల జరిమానా విధిస్తూ అదనపు సెషన్స్ జడ్జి రితేశ్ సింగ్ బుధవారం తీర్పునిచ్చారు.
దోషుల నేరాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, వారిపై కనికరం చూపాల్సిన అవసరం లేదని జడ్జి స్పష్టం చేశారు. ఈ నలుగురితో పాటు రామ్ సింగ్, మరో మైనర్ బాలుడు కలసి ఆధర్‌ను బస్‌లో తీవ్రంగా కొట్టి, డబ్బులను దోచుకున్నాక బస్సులో నుంచి నెట్టివేశారు. ఆ తర్వాత ‘నిర్భయ’ను ఆమె స్నేహితుడిని బస్‌లో ఎక్కించుకుని, ఆ స్నేహితుడిని గాయపర్చి, ఆమెపై పాశవికంగా సామూహిక అత్యాచారం చేశారు.