జమ్మూ ప్రధాన బస్టాండ్ కూతవేటు దూరంలోని నీలం హోటల్లో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
జమ్మూ ప్రధాన బస్టాండ్ కూతవేటు దూరంలోని నీలం హోటల్లో శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవ దహనమైయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. స్థానికులు వెంటనే అప్రమత్తమై క్షతగాత్రులను జమ్మూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని చెప్పారు.
పోలీసుల కథనం ప్రకారం... హోటల్ నుంచి భారీగా అగ్నికీలలు ఎగసి పడటంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఫిర్యాదు చేశారు. దాంతో దాదాపు 12 అగ్నిమాపక శకటాలు హుటాహుటిన హోటల్ వద్దకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయని చెప్పారు. హోటల్ కింద భాగంలో ఉన్న స్టోరు రూంలో అగ్ని ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.