మొగాదీషు: సోమాలియా రాజధాని మొగాదీషులో అల్ షబాబ్ సంస్థకు చెందిన తీవ్రవాదులు రెచ్చిపోయారు. నగరంలోని దేశాధ్యక్ష భవనానికి కూతవేటు దూరంలో ఉన్న రెండు హోటళ్లపై దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు.
హోటల్ వద్ద కారుతోపాటు వచ్చిన వ్యక్తి ఆత్మహుతి దాడికి పాల్పడగా... మరో వ్యక్తి తుపాకీతో రెండు హోటళ్లపై విచక్షణరహితంగా కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే అక్కడే ఉన్న భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులకు దిగారని పోలీసులు చెప్పారు. ఈ ఘటన నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లోని హోటల్స్ అన్ని మూసివేసినట్లు పోలీసులు తెలిపారు.