విద్యార్థి ఎన్నికల్లో ఓ అమ్మ.. ఓ స్వలింగ సంపర్కుడు.. ఓ కజకిస్థానీ!
Published Wed, Sep 11 2013 2:45 PM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ) లో ఎన్నికలంటేనే దేశవ్యాప్తంగా ఓ ఆసక్తి కలగడం సహజం. అయితే ఈసారి జేఎన్ యూ లో ఎన్నికలు మరో విధంగా ఆకర్షిస్తున్నాయి. ఈ సంవత్సరం జరిగే ఎన్నికల్లో పలు పార్టీలు విజయం సాధించడానికి బలమైన అభ్యర్థులను బరిలో నిలిపారు. అయితే జేఎన్ యూ ఎన్నికల్లో గే (స్వలింగ సంపర్కుడు), ఓ తల్లి, కజకిస్థాన్ కు చెందిన అభ్యర్థులు నేను సైతం అంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఓ పాపకు తల్లైన గుంజన్ ప్రియ జేఎన్ యూ లో ఎంఫిల్ స్టూడెంట్. గుంజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) పార్టీ తరపున కౌన్సిలర్ గా ప్రచారం చేస్తోంది. అయితే గుంజన్ కూతురు కూడా జేఎన్ యూ క్యాంపస్ లో తన తల్లికి ఓటు చేయాలని ప్రచారం చేయడం అందర్ని ఆకట్టుకుంటోంది.
'తాను వివాహితురాలిని. లింగ సమానత్వం కోసం పోరాడుతాను. వివాహిత మహిళలకు ప్రత్యేక హాస్టల్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి' అనే డిమాండ్ తో గుంజన్ ముందుకెళ్తోంది.
ఇక ఎస్ఎఫ్ఐ బ్యానర్ లో లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ జెండర్ (ఎల్ జీబీటీ) కమ్యూనిటీ తరపున గౌరవ్ ఘోష్ రంగంలో నిలువడం ప్రత్యేకతగా నిలిచింది. ఎల్ జీ బీటి కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులకు జేఎన్ యూ లో సమాన హోదా కల్పించాలి. మా కమ్యూనిటీలోని సభ్యులపై వివక్ష కు అంతం పలికి, సమానత్వం కల్పించాలని గౌరవ్ డిమాండ్ చేస్తున్నాడు.
ఇక జేఎన్ యూ ఎన్నికల్లో విదేశీ విద్యార్థి కూడా అధ్యక్ష పదవికి పోటి పడుతూ తనదైన శైలిలో ప్రచారం కొనసాగిస్తున్నాడు. కజకిస్థాన్ కు చెందిన అక్మెత్ బెకోవ్ ఝాస్సులాన్ ఓ అనువాదకుడి సహాయంతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నాడు. మాజీ సైనికుడైన ఝాస్సులాన్ కు యుద్దంలో పాల్గొన్నందుకు పలు పతకాలు కూడా దక్కించుకున్నట్టు సమాచారం.ఝాస్సులాన్ ప్రస్తుతం జేఎన్ యూలో ఎకనామిక్స్ లో స్నాతకోత్సవ విద్యను అభ్యసిస్తున్నాడు. ఝాస్సులాన్ జనతాదళ్ యునైటెడ్ (జేడీ-యూ) తరపున బరిలో ఉన్నారు. జేఎన్ యూలో విదేశీ విద్యార్థులకు ఇబ్బందులున్నాయని.. భాష ప్రధానంగా అనేక సమస్యలను సృష్టిస్తోందని.. ఇలాంటి పరిస్థితులను అధిగమించేలా తాను చర్యలు తీసుకుంటానని తన ఎజెండాగా ప్రచారంలో ముందుకు పోతున్నాడు. అనేక విశేషాలతో కొనసాగుతున్న ప్రచారం సెప్టెంబర్ 13 తేదిన జరిగే ఎన్నికలతో ముగియనుంది.
Advertisement
Advertisement