ఏప్రిల్ 30, మే 7 తేదీల్లో ఎన్నికలు.. మే 16న ఫలితాలు | general election schedule announced | Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 30, మే 7 తేదీల్లో ఎన్నికలు.. మే 16న ఫలితాలు

Published Wed, Mar 5 2014 11:00 AM | Last Updated on Tue, Aug 14 2018 5:51 PM

ఏప్రిల్ 30, మే 7 తేదీల్లో ఎన్నికలు.. మే 16న ఫలితాలు - Sakshi

ఏప్రిల్ 30, మే 7 తేదీల్లో ఎన్నికలు.. మే 16న ఫలితాలు

సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎన్ సంపత్ ప్రకటించారు. మన రాష్ట్రంలో రెండు దశల్లో.. అంటే ఏప్రిల్ 30వ తేదీ, మే 7వ తేదీలలో ఎన్నికలు జరుగుతాయి. మొత్తం అన్ని రాష్ట్రాలలోనూ లోక్సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాలలో శాసన సభ ఎన్నికలు జరిగిన తర్వాత మే 16వ తేదీ శుక్రవారం నాడు ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం తొమ్మిది దశల్లో ఏప్రిల్7 నుంచి మే 12వ తేదీ వరకు పోలింగ్ జరుగుతుంది.

15వ లోక్‌సభ గడువు మే 31వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో 16వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ను వీఎన్ సంపత్ ప్రకటించారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలకు కూడా షెడ్యూలు ప్రకటించారు. తొలిసారిగా ఈ ఎన్నికల్లో నోటా అమలుచేస్తున్నారు. షెడ్యూలు ప్రకటనతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని సంపత్ తెలిపారు. రాజకీయ పార్టీలతో ఏప్రిల్ 4న సమావేశం ఉంటుందని, మే 31 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని ఆయన చెప్పారు.


లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులకు ఖర్చు పరిమితిని 70 లక్షలుగా నిర్ణయించారు. సీఈసీతో పాటు ఎన్నికల కమిషనర్లు హెచ్.ఎస్.బ్రహ్మ, ఎస్.ఎన్.ఎ.జైదీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షెడ్యూలు ప్రకటనతో బుధవారం నుంచే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. సాధారణంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు ప్రకటన కేంద్ర ప్రధాన ఎన్నికల కార్యాలయంలోనే జరుగుతుంది. కానీ ఈసారి వేదికను కేంద్ర ఎన్నికల సంఘం విజ్ఞాన్‌భవన్‌కు మార్చింది.

మార్చి 9వ తేదీన బూత్ లెవెల్ అధికారులు సమావేశం అవుతారని, ఆరోజున ఎన్నికల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారని ఆయన అన్నారు. ఎండలు బాగా ఉండే కాలాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని, పంటలు, వ్యవసాయం ఊపందుకునే సమయాల్లో పోలింగ్ తేదీలు లేకుండా చూసుకున్నామని చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే పది కోట్ల మంది ఓటర్లు పెరిగారన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల పరీక్షలను కూడా దృష్టిలో పెట్టుకున్నట్లు చెప్పారు. దేశంలో మొత్తం 81.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. తాగునీటి సదుపాయాలు, షెడ్లు, మంచినీళ్ల సదుపాయం, వికలాంగుల కోసం ర్యాంపులు తప్పనిసరిగా ఉండేలా చూశామన్నారు. నోటా సదుపాయాన్ని గత ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ప్రవేశపెట్టామని, ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూడా అవి ఉంటాయని తెలిపారు.

98.64 శాతం మంది పేర్లు, ఫొటోలు ఓటర్ల జాబితాలో ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఎవరివైనా పేర్లు ఎన్నికల ఓటర్ల జాబితాలో లేకపోతే ఇప్పటికీ సరిచేయించుకోచ్చవని చెప్పారు. ఎన్నికల విధులలో పాల్గొనే అధికారులంతా నిష్పాక్షికంగా వ్యవహరించాలని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి ఉండాలని, క్రమశిక్షణ పాటించాలని సంపత్ స్పష్టం చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

2009 ఎన్నికల నాటికి ఫొటోలతో ఓటర్ల జాబితాలు లేవని, కానీ ఈసారి మాత్రం వాటిని అమలులోకి తెచ్చామని, దీనివల్ల ఓటరు పేరు, ఫొటో, చిరునామా, పోలింగ్ కేంద్రం.. ఇలాంటి వివరాలన్నీ అందులో ఉంటాయని చెప్పారు. ఇది పోలింగ్ సిబ్బందితో పాటు ఓటర్లకు కూడా అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు. మార్చి 9వ తేదీన 11లక్షల కేంద్రాల్లో ఓటర్ల జాబితాలో పేర్లు నమోదుచేయించుకునే అవకాశం ఉంటుందన్నారు.

తొలి పోలింగ్ .. ఏప్రిల్ 7వ తేదీ. ఆరోజు ఆరు తదుపరి 9వ తేదీ ఉంటుంది. ఆరోజు ఐదు రాష్ట్రాల్లో 7 పార్లమెంటరీ నియోజవకర్గాల్లో ఉంటుంది. ఆ తర్వాత 10వ తేదీన 14 రాష్ట్రాల్లో 92 నియోజకవర్గాల్లో ఉంటుంది. 12వ తేదీన మూడు రాష్ట్రాల్లో 5 నియోజకవర్గాల్లో ఉంటుంది. 17వ తేదీన 13 రాష్ట్రాల్లో 122 నియోజకవర్గాల్లో పోలింగ్ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement