శివార్లలో ‘ఔటర్ల’ హల్‌చల్!
* జీహెచ్‌ఎంసీ శివారు వార్డుల్లో జిల్లా నేతల పాగా
* తమ జిల్లాల ప్రజలు ఎక్కువగా ఉన్న చోట ప్రచారం
* ఎల్‌బీనగర్ సర్కిల్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్
* సాగర్ రహదారి డివిజన్లలో మంచిరెడ్డి వర్సెస్ గుత్తా
* ఉప్పల్‌లో ఈటల వర్సెస్ దామోదర్‌రెడ్డి, ఉమా మాధవరెడ్డి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జీహెచ్‌ఎంసీ పీఠంపై కన్నేసిన అధికార పార్టీ మంత్రులకు డివిజన్ల బాధ్యతను అప్పగించగా... గ్రేటర్ శివార్లలో జిల్లాల ప్రజలు ఎక్కువగా ఉన్న చోట ఆయా జిల్లాల నేతలను కాంగ్రెస్, టీడీపీ రంగంలోకి దింపాయి.
శివారు డివిజన్‌లలో స్థిరనివాసం ఏర్పరచుకున్న తమ జిల్లాల ఓటర్లను ప్రభావితం చేసేందుకు.. ఆ నేతలను బరిలోకి తెచ్చి వ్యూహాత్మక ఎత్తుగడ వేశాయి. దీంతో అధికార పార్టీ కూడా మంత్రులను వారికి తొలుత కేటాయించిన డివిజన్ల నుంచి... వారి జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా నివసిస్తున్న డివిజన్లను పంపే పనిలో నిమగ్నమైంది. నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి మంత్రులకు డివిజన్ల కేటాయింపు పూర్తిచేసేలా కసరత్తు చేస్తోంది. ఈలోగానే ఆయా జిల్లాల నేతలతో ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కాంగ్రెస్, టీడీపీ భావిస్తున్నాయి. ఇక బీజేపీ తరఫున ఆర్‌ఎస్‌ఎస్ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు.
ఎల్‌బీ నగర్‌లో నల్లగొండ నేతలు
ఎల్‌బీ నగర్ సర్కిల్ పరిధిలోని ఎనిమిది డివిజన్లకు నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్‌రెడ్డి టీఆర్‌ఎస్ తరఫున బాధ్యత తీసుకోగా... ఆయనకు ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వేముల వీరేశం, టీఆర్‌ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి సహకరిస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బాధ్యత తీసుకున్నారు. ఇదే సర్కిల్‌లోని బీఎన్‌రెడ్డి నగర్, హస్తినాపురం, ఆర్.కె.పురం, సంతోష్‌నగర్ డివిజన్ల బాధ్యతను ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అప్పగించారు.
తెలుగుదేశం పార్టీ తమ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుతో పాటు నల్లగొండ జిల్లా నేతలు పలువురికి ఈ ప్రాంతంలో ప్రచార బాధ్యతలు అప్పగించింది. నల్లగొండ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఘనవిజయం సాధించిన కోమటిరెడ్డి బ్రదర్స్.. ఎల్‌బీనగర్ సర్కిల్‌లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడటమే లక్ష్యంగా ప్రచారంలోకి దిగారు. గత ఆదివారం నామినేషన్ల కార్యక్రమానికి వారిద్దరూ హాజరయ్యారు. బుధవారం నుంచి అభ్యర్థులతో పాటు తాము ప్రచారంలో పాల్గొంటామని వెంకట్‌రెడ్డి చెప్పారు. దిల్‌సుఖ్‌నగర్ నుంచి హయత్‌నగర్ దాకా విస్తరించి ఉన్న నల్లగొండ జిల్లా వాసులను కలుసుకుని మద్దతు కోరడమే అన్ని పార్టీల నల్లగొండ జిల్లా నేతల లక్ష్యం.
ఉప్పల్‌లో ఈటల.. కూకట్‌పల్లిలో తుమ్మల
ఉప్పల్ సర్కిల్‌లో ఆర్థిక మంత్రి ఈటల టీఆర్‌ఎస్ తరఫున ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, టీడీపీ తరఫున ఉమామాధవరెడ్డి ప్రచారంలో నిమగ్నమయ్యారు. పార్టీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొన్న ఈ నేతలు ప్రచారం కూడా ప్రారంభించారు. ఇక మినీ ఏపీగా పిలిచే కూకట్‌పల్లిలో టీఆర్‌ఎస్ తరఫున ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల, టీడీపీ తరఫున రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి బాధ్యతలు తీసుకున్నారు.
శేరిలింగంపల్లిలో అధికార పార్టీ తరఫున రంగారెడ్డి జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, టీడీపీ తరఫున వరంగల్ జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. రాజేంద్రనగర్‌లో మహబూబ్‌నగర్ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ తరఫున అదే జిల్లాకు చెందిన గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి ఎన్నికల సారథ్య బాధ్యతలు నిర్వరిస్తున్నారు.